జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి కోట వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి. రాము, సి.హెచ్ వెంకటేష్ మాట్లాడారు. 2019 లో మంజూరైనటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేటి వరకు సొంత భవనాలు ఏర్పాటు చెయ్యడంలో పాలకులు మీనమీసాలు లెక్కపెడుతున్నారు. మహారాజా సాంస్కృత కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకే భవనంలో నడుస్తుంది. దీని వలన తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, ల్యాబ్ లు, లైబ్రరీలు వంటి ఇతర ఏ సదుపాయాలు లేకపోవడం వలన విద్యార్థుల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో మాన్సాస్ పరిధిలో ఉన్నటువంటి బి.ఇ.డి, లా, ఇంటర్మీడియట్ కలశాలలు ఎయిడెడ్ పాఠశాలలు అన్ని మూతబడ్డాయి. ఆ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక భవనాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాత్కాలికంగా నడుపుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు జరగడం లేదు. యుజీసీ నిధులతో, రూసా నిధులతో, విద్యార్థులు కట్టిన ఫీజులతో అభివృద్ధి చెందినటువంటి మహారాజా అటానమస్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా నడపాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నా పాలకులు పెదచెవున పెడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సూరిబాబు, రాజు మరియు విద్యార్థులు పాల్గున్నారు.


