Listen to this article

రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

జనం న్యూస్ ఆగస్టు 20, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

విద్యారంగ బలోపేతం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రాత్రి జిల్లాలో జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గల ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో రాత్రి బస చేసి బుధవారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. వసతి గృహం వంటశాల, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టిక, పాఠశాల వసతిగృహ పరిసరాలను పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహాలలో పేద విద్యార్థులే వసతి పొందుతున్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాల పిల్లలు సంక్షేమ వసతిగృహాలలో విద్య అభ్యసిస్తున్నారని, ఈ క్రమంలో వారికి కనీస మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన ఆహారాన్ని అందించి చదువుకునేందుకు తోడ్పాటు అందించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల, వసతి గృహంలో వారికి అందుతున్న ఆహారం, వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులను విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాలను పరీక్షించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని తెలిపారు. విద్యా విధానం, బోధన పద్ధతులు మార్చాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.