ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్
జనం న్యూస్-ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనం సందర్శన అద్భుతమైన గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. సోమవారం నాగార్జునసాగర్ ను ఆయన సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునకొండ మ్యూజియాన్ని, నాగార్జునసాగర్ డ్యాం ను, బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధ చరితవనం, ధ్యానవనం,స్థూప వనాలను సందర్శించారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించారు. బుద్ధవనం విశేషాలు తెలిపే వీడియోని వీక్షించారు.. వీరికి బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర లు బుద్ధవనం విశేషాలను తెలియజేసి పంచశీల కండువాలతో సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ బుద్ధవనం సందర్శన మానసిక ఆనందాన్ని ఇస్తుందని, మహా అద్భుతమైన అనుభూతిని అందజేసింది అన్నారు. అలనాటి మహాయాన బౌద్ధ సంప్రదాయాన్ని పునర్ సృష్టి చేయడం గొప్ప విషయమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, టూరిజాన్ని అభినందిస్తున్నామన్నారు. బుద్ధ వనంలోని శిల్పకళ పురాతన భారతీయ బౌద్ధ సంప్రదాయాన్ని గుర్తుకు చేస్తున్నాయన్నారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సలహాదారులు పోసాని వెంకటేశ్వర్లు, విజిల్ మీడియా ప్రతినిధి సుభాకర్, డాక్టర్ జయకుమార్, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


