

జనం న్యూస్, ఆగస్టు 30, పెద్దపల్లి
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు. తెలంగాణకు మంజూరైన తొమ్మిది లక్షల టన్నుల కోటాలో కేవలం నాలుగున్నర లక్షల టన్నుల యూరియానే అందిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యూరియా కొరతపై కేంద్రానికి వినతులు విదేశాల నుంచి రావలసిన 30 లక్షల టన్నుల యూరియా రాకపోవడం వల్ల దేశవ్యాప్తంగా యూరియా కొరత తలెత్తిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల యూరియా దిగుమతులు నిలిచిపోయాయని విమర్శించారు. తెలంగాణకు తక్షణ అవసరంగా 50 వేల టన్నుల యూరియా అవసరమని కోరిన వెంటనే కేంద్ర నాయకుడు జేపీ నడ్డా స్పందించి అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రానున్న 10 రోజుల్లో 25 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుస్తామని పేర్కొన్నారు. రామగుండం ప్లాంట్లో లోపాలు – చర్యలకు ఆదేశాలు ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి అక్కడి లోపాలను గుర్తించినట్లు తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ సమస్యలపై సమగ్ర విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయం – ప్రజల కోరికను నెరవేర్చేందుకు ప్రయత్నాలు తెలంగాణలో ఒక్కటి మాత్రమే విమానాశ్రయం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నుంచి పది విమానాశ్రయాలు ఉన్నాయన్న వాస్తవాన్ని కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. రామగుండం ప్రజల చిరకాల కోరిక అయిన విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించేందుకు వినతిపత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. ESI ఆసుపత్రి, ఫ్లైఓవర్లపై కార్యాచరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో ESI ఆసుపత్రి నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించామని, కేంద్ర ఆరోగ్య శాఖతో మాట్లాడి 150 కోట్లతో టెండర్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. అలాగే పాలకుర్తి మండలంలో కన్నాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. త్వరితగతిన పనులు ప్రారంభించి రవాణా సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీపై తీవ్ర విమర్శలు బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రజల్లో ఉనికిపై భయం పట్టుకున్న బీజేపీ, ప్రశ్నించే వారిని బెదిరించేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. అంబెడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితులపై ప్రజలకు అప్రమత్తత భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ హెచ్చరించారు. ఏవైనా అత్యవసర అవసరాలు ఉంటే అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు.
