

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఇటీవల 10వ తరగతి, ఇంటర్మీడియట్, బి.టెక్ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో
ఉత్తమ ప్రతిభ కనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు ఉద్యోగుల పిల్లలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ పోలీసు కార్యాలయంలో అభినందించి, ప్రశంసా పత్రాలను, మెరిట్ స్కాలర్ షిప్ లను ఆగస్టు 30న అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి, మంచి ఫలితాలనుసాధించాలన్నారు. చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని, ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు ప్రయత్నించాలన్నారు. మంచి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, ఉన్నత స్థానానికి చేరుకొనేందుకు కృషి చేయాలని, తల్లిదండ్రులకు, పోలీసుశాఖకు, జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. స్కాలర్షిప్స్ పొందిన విద్యార్థులు ప్రస్తుతం ఏమి చదువుతున్నది, ఎక్కడ చదువుతున్నది, ఎలా చదువుతున్నది వంటి విషయాలను జిల్లా ఎస్పీ విద్యార్ధులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం, చదువులో ఉన్నతంగా రాణించేందుకు విద్యార్థులకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేసారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ఉద్యోగులు, సిబ్బంది ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. పోలీసు ఉద్యోగుల శ్రమ వృధా కారాదన్నారు. 2023-24 విద్యా సంవత్సరంకు చదువులో ప్రతిభ కనబర్చిన, ఉన్నతంగా రాణించిన పోలీసు ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వారు సాధించిన మార్కులు ఆధారంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 87 మంది విద్యార్థులకు రూ.16,54,000/- లను స్కాలర్ షిప్స్ మంజూరు చేసిందన్నారు. ఒక్కొక్క విద్యార్థికి వారు సాధించిన మార్కులు ఆధారం గా రూ.10 వేలు నుండి రూ.30వేలు వరకు మంజూరు చేసిన స్కాలర్ షిప్స్ ను ప్రధానం చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. వీటికి అదనంగా 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఐఐటి, నీట్, జె.ఈ.ఈ. అడ్వాన్సు పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులు సాధించిన ర్యాంకులు ఆధారంగా మరో 11 మంది విద్యార్థులకు మెరిటోరియస్ స్కాలర్షిప్స్ గా రూ.6,95,000/- లను చీఫ్ ఆఫీసు మంజూరు చేసిందన్నారు. ఒక్కొక్క విద్యార్ధికి రూ.25వేలు నుండి రూ.1.20 లక్షలను మెరిటోరియస్ స్కాలర్షిప్స్ త్వరలో అందించనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, వెల్ఫేర్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, పోలీసు ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు.