Listen to this article

కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి

చెరువు కట్ట కబ్జా చేస్తూ అడ్డుతగులుతున్నారు

పెద్ద చెరువు కట్ట పనులు నక్ష ప్రకారమే చేపట్టాలి

లేదంటే దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం

ఎమ్మెల్యే అండతో గుత్తెదారును బెదిరించడం సరికాదు

మైలారం మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్

శాయంపేట: శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో హుస్సేన్ పల్లి నుంచి మైలారం పెద్ద చెరువు కట్ట వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అడ్డుకుని, ఎమ్మెల్యే అండదండలతో పనులను తనకు ఇష్టం వచ్చిన విధంగా చేపట్టాలని కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్నారని మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ గడిపె విజయ విజయ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీటీ రోడ్డు పనులకు గాను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హయాంలో 2023లో రూ. కోటి 60 లక్షల సీఆర్ఆర్ నిధులు మంజూరైనప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు గుత్తేదారును బెదిరించడం వల్లే ఆయన పనులు ఆపివేశాడని చెప్పారు. అంతేగాక బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సిన విధంగా కాకుండా బుచ్చిరెడ్డి తన స్వలాభం కోసం తన భూమి దగ్గరికి వచ్చే రోడ్డును చెరువులోకి వంకరగా పోయించాడని తెలిపారు. దాదాపు 200 మీటర్ల పొడవున చెరువు లోపల13 ఫీట్లు వెడల్పుతో రోడ్డు పోయించాడన్నారు. దళితులకు సంబంధించిన గోరీలను కూల్చి కొంత భూమిని తన వ్యవసాయ భూమిలో కలుపుకున్నాడు. రైతులు యథావిధిగా వెళ్లే బాటలో నుంచి కూడా వారిని వెళ్లనివ్వడం లేదని చెప్పారు. నక్ష ప్రకారమే పెద్ద చెరువు కట్ట పనులు చేపట్టాలని, పనులు ఇష్టారీతిగా చేపట్టడం వల్ల మైలారం గ్రామంలోని దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అరిజెల సునీత సాంబరెడ్డి, మాజీ సర్పంచ్ మస్కె సదయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మస్కె సుమన్, మస్కె భాస్కర్, ఒంటేరు శంకర్, గడిపె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.