

సేవా పక్షం మండల స్థాయి కార్యశాల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాపన్నపేట.
సెప్టెంబర్.11 (జనంన్యూస్)
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మండల పరిధి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సేవా పక్షం మండల స్థాయి కార్యశాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను ప్రేమతో గెలవాలని, జనం గుండెల్లో చోటు సంపాదించిన వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రత్యర్థులు రూ.కోట్లు ఖర్చు చేసినా ఓటమి పాలయ్యారన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు వారి నాయకుడు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. భవిష్యత్తులో తిండిని వృధా చేయకుండా అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేశానని చెప్పారు. మోదీ నాయకత్వంలో ప్రపంచం గర్వించేలా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించిన ఘనత మోడీదే అని పేర్కొన్నారు. సేవా పక్షం పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యకర్తలు తమకు తోచిన స్థాయిలో రక్తదానం, పేదలకు సరుకుల పంపిణీ, రోగులకు పండ్లు, పేదలకు అన్నదాన శిబిరాలు నిర్వహించి మోదీపై తమ అభిమానం చాటాలన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరు పై ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి స్వదేశీ వస్తువులు వాడి దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం కొత్తపల్లి వంతెన వద్ద ఉన్న అసంపూర్తి రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులతో ఫోనులో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ఇల్లు పంట పొలాలు నష్టపోయిన వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, వీణ, మల్లిక, మండల అధ్యక్షుడు సంతోష్ చారి బికొండ రాములు, సీనియర్ నాయకులు ఆకుల సుధాకర్ భూషణం, విజయ్, కిషన్ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ వివిధ గ్రామాల మండల అధ్యక్షులు, బిజెపి పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
