

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు
జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్‌ల దుర్వినియోగం – ఇవన్నీ అధికారుల కళ్లముందే సాగుతుండటం ప్రజాస్వామ్య పరిపాలనకు మచ్చ. ఇది కేవలం ఒక వ్యాపార మాఫియా సమస్య కాదు; ఇది అధికార నిర్లక్ష్యం, అవినీతి, రాజకీయ రక్షణ కలిసొచ్చిన వ్యవస్థాత్మక విఫలం.ఈ దందా మూలంగా పేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. యువత వ్యసనపు బాటలో నడవడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, సామాజిక నిర్మాణం దెబ్బతినడం వంటి అనర్థాలు ఇప్పటికే బయటపడుతున్నాయి. ప్రజల జీవితాలను దెబ్బతీసే ఈ సిండికేట్‌ను అరికట్టకపోవడం ప్రభుత్వానికి పెద్ద అవమానం.ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ బెల్టు షాపుల తక్షణ మూసివేత, ముఠాలపై శిక్షలు, లైసెన్స్ ప్రక్రియలో పారదర్శకతను సాధించకపోతే ఈ సమస్య మరింత ఉధృతమవుతుంది.కానీ కేవలం ప్రభుత్వం మీద ఆధారపడటం సరిపోదు. ప్రజలు స్వయంగా ముందుకు రావాలి. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అక్రమ షాపుల వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. ప్రజా సంఘాలు, మీడియా, రాజకీయ పార్టీలు తమ తారతమ్యాలను పక్కన పెట్టి ఒకే లక్ష్యం కోసం కృషి చేయాలి – “మద్యం మాఫియాను కూలదోసి, ప్రజల జీవన హక్కులను రక్షించాలి.”మౌనం ఇక సమాధానం కాదు. ప్రజల భవిష్యత్తును కాపాడాలంటే ప్రజలే స్వరం ఎత్తాలి. ప్రజల పోరాటమే మద్యం సిండికేట్‌కు తుదిపాటి. అవుతుందని కురిమెల్ల శంకర్ పేర్కొన్నారు