Listen to this article

కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ సెప్టెంబర్ 29

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అమీన్పూర్ ప్రాంతం మొత్తం పూల మాలలతో, రంగురంగుల అలంకరణలతో సందడి చేసింది.ఈ సందర్భంగా జబర్దస్త్ హాస్య నటి కొమురక్క వినోదభరిత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించగా, సంగీత విభావరి,ఖాజీపల్లి భరత్, ప్రముఖ గాయని అఖిల సమిష్టిగా అందించిన పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ సప్తపదులు, తెలంగాణ జానపద గీతాలు, బతుకమ్మ గీతాలతో వేదిక ఊగిపోయింది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ తాళం వేసి పాల్గొనడం విశేషం. బతుకమ్మ వేడుకలలో పోటీలను కూడా నిర్వహించారు. మహిళలు అద్భుతమైన శ్రద్ధతో వివిధ రకాల పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చగా, వాటిని ప్రత్యేక న్యాయనిర్ణేతలు పరిశీలించి మొదటి, రెండో, మూడో, బహుమతులు అందజేశారు. ఈ బహుమతుల పంపిణీ వేడుకలో ఆనంద హర్షాలు వ్యక్తమయ్యాయి. అనంతరం కాటా సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా అమీన్పూర్ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుతూ ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ స్త్రీ శక్తి, ఆచార సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రాంతీయ మహిళలు, యువతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొని పూలదండలతో బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలు పూల పరిమళాలతో నిండిపోయాయి.