Listen to this article

జనం న్యూస్ 29 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని మారుమూల గ్రామమైన భట్లచందారం లో జన్మించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వార్ల వెంకటయ్య, యశోద గార్ల కుమార్తె యగు వార్ల సుష్మ నిన్న విడుదల అయిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) ఉద్యోగమునకు సెలెక్ట్ కాబడినది. వార్ల సుష్మ వెనుకబడిన తరగతులకు చెందిన ముదిరాజ్ కుటుంబములో జన్మించి ప్రాథమిక విద్యాభ్యాసము పరిగి పట్టణములోని సెయింట్ గోన్సాలో స్కూలులో పూర్తిచేసి హై స్కూలు మరియు ఇంటర్ విద్య మేడ్చల్ జిల్లాలో పూర్తిచేసినది. చదువులో అతి ఉత్తమమైన ప్రతిభ కలిగి చురుకుగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేయడం జరిగింది. బీటెక్ తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగములకు ఆసక్తి కనబరచకుండా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో అత్యుత్తమమైన ర్యాంకులు, గ్రూప్ 2లో మహిళా విభాగములో జోనల్ స్థాయిలో 3వ ర్యాంకు రాష్ట్రస్థాయిలో 321 ర్యాంక్ సాధించింది, గ్రూప్ 3లో 51 వ ర్యాంకు , గ్రూప్ 4 పరీక్షలో 221 ర్యాంకు సాధించి ప్రస్తుతము నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డ్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న విడుదలైన గ్రూప్ 2 పరీక్షలో రాష్ట్ర సచివాలయంలో ASO గా నియామకము పొంది అందరూ ఆశ్చర్యపడేలా మొదటి ప్రయత్నంలోనే మూడు ఉద్యోగా లకు నియామకము గావింపబడినందున అందరూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కృతాభివందనాలు తెలియజేసినారు. వార్ల సుష్మ మాట్లాడుతూ.. తన ప్రధాన లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధించడమే అని తెలియజేసినారు. సివిల్ సర్వీసెస్ సాధించి దేశ సేవకు అంకితం అవుతానని చెప్పినారు. తన విజయానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతాభివందనములు తెలియజేసినారు. పలువురు ప్రముఖులు సుష్మ యొక్క ప్రతిభను కొనియాడుతూ అభినందనలు తెలియజేసినారు.