Listen to this article

ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఖండన

జనం న్యూస్ అక్టోబర్ 05 సంగారెడ్డి జిల్లా

అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు.పటేల్‌గూడా ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ — “పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కొందరు అజ్ఞాత వ్యక్తులు ఈ విధంగా దిమ్మెను ధ్వంసం చేశారు. ఇది కేవలం జెండా దిమ్మెపై దాడి కాదు, ప్రజల విశ్వాసంపై దాడి” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ఈ ఘటనతో గ్రామంలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. స్థానిక బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. పార్టీ జెండా దిమ్మెను తిరిగి నెలకొల్పి, పార్టీ పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించారు.అమీన్ పూర్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. దోషులను గుర్తించడానికి సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.