Listen to this article

పక్కనే ఉంటూ మంచి చెడ్డా చూడాల్సిన వ్యక్తులు దారుణాలు చేయడానికి వెనకాడటం లేదు. అందరూ ఉన్నా, ఆనాథ శవం అంటూ ఆస్తులన్నీ కాజేసిన ఘటన ఎర్రగొండపాలెంలో చోటుచేసుకొంది.

నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు!
రిజిస్ట్రేషన్‌ జరిగిన నివాసం

మృతిచెందిన రోజే వీలునామా రాసినట్లు పత్రాలు

అనంతరం వాటిపైనే రిజిస్ర్టేషన్‌

ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ.4 కోట్లు పై మాటే

లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఎర్రగొండపాలెం రూరల్‌ జనవరి 29 (జనం న్యూస్):

పక్కనే ఉంటూ మంచి చెడ్డా చూడాల్సిన వ్యక్తులు దారుణాలు చేయడానికి వెనకాడటం లేదు. అందరూ ఉన్నా, ఆనాథ శవం అంటూ ఆస్తులన్నీ కాజేసిన ఘటన ఎర్రగొండపాలెంలో చోటుచేసుకొంది. బాధితులు కథనం మేరకు… వెలగపూడి తిరుమలరావు, బ్రహ్మాజిలు అన్నాదమ్ములు. స్థానిక మార్కాపురం రోడ్డులోని ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో సర్వేనెంబరు 58, 58-1లో 5 కుంటల స్థలం, నివాసంలో ఉంటున్నారు. అన్న తిరుమలరావుకు ఇద్దరు కుమార్తెలు వారు హైదరాబాదులో ఉంటున్నారు. తమ్ముడు బ్రహ్మాజి భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. పెద్ద కుమారుడైన తిరుమలరావు అనారోగ్యం సరిగ ఉండకపోవంతో హైదరాబాద్‌లోని కుమార్తె వద్ద ఉంటున్నాడు. ఇక్కడ బ్రహ్మాజి ఒక్కడే ఉంటూ తన వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బ్రహ్మాజీకి కూడా ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత ఏడాది అక్టోబరులో అన్న వద్దకు హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోని నవంబరు 3న తిరిగి ఎర్రగొండపాలెం వచ్చాడు. 4వ తేదీ అన్న తిరుమల రావు ఫోన్‌ చేస్తే తీయలేదు. 5న ఉదయం స్థానికులు తమ్ముడు మృతి చెందాడు అనే సమాచారంతో ఎర్రగొండపాలెం వచ్చి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుమల హైదరాబాద్‌ వెళ్లారు. అయితే తిరుమలరావు ఆరోగ్యం కూడ సరిగా లేకపోవడంతో ఆయన ఇక్కడ వ్యవహారం పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఎర్రగొండపాలెం మండలం సర్వాయిపాలేనికి చెందిన దొడ్డపనేని శ్రీనివాసులు అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి తమ సోదరుడు బ్రహ్మాజీ వాటాకు వచ్చిన ఆస్తులు వీలునామా ద్వారా రాయించుకున్నాడని ఆరోపించారు. నకిలీ ధ్రువపత్రాలు చూపి, శ్రీనివాసులు తన భార్య యోగమ్మ పేరున ఈ నెల 18వ తేదీన ఎర్రగొండపాలెంలోని స్థలాన్ని రిజిస్టర్‌ చేశారన్నారు. పంచాయతీ, రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ అధికారులు అందరు కలసి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తిరుమలరావు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై చౌడయ్యను వివరణ కోరాగా కేసులో లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు.

సిట్‌ కేసులో ఒకరి అరెస్టు

(ఒంగోలు క్రైం), జనవరి 29 (జనం న్యూస్):

ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమంగా భూములు అమ్ముకున్న కేసులో బాపనపల్లి వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు విచారణాధికారి, యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్‌ మంగళవారం తెలిపారు. ఒంగోలు నగర పరిధిలో ముక్తినూతలపాడు, పెళ్లూరు, చెరువుకొమ్ముపాలెం ప్రాంతాలలో ఉన్న భూములకు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు చేసిన స్థానిక సుజాతనగర్‌కు చెందిన బాపనపల్లి వెంకటేశ్వర్లుపై వన్‌టౌన్‌లో కేసు నమోదైంది. అప్పటిలో ఆ కేసును యర్రగొండపాలెం సీఐ విచారణ చేశారు. నాటి నుంచి తప్పించుకొని తిరుగుతుండగా ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు.