

బీసీల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు
జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్
జనం న్యూస్, అక్టోబర్ 11, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, హెచ్చరించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులను అడ్డం పెట్టుకొని 42 శాతం రిజర్వేషన్ అడ్డుకున్న రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రాజకీయ రిజర్వేషన్ తో పాటు విద్య, ఉద్యోగ నియామకాల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆరు నెలలవుతుందని గుర్తు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందినప్పటికీ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతo రిజర్వేషన్ అమలు కోసం జీవో నెంబర్ 9 తేగా, రాజకీయ పార్టీల అండతో కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నట్లు విమర్శించారు. అయితే రాష్ట్రపతి, గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించకపోవడం తగదని నిలదీస్తూ వారిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని, ఇందుకోసం ప్రజలను చైతన్యం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరేష్, న్యాయవాది శ్రీనివాస్ పాల్గొన్నారు.