Listen to this article

బౌద్ధం మతం కాదు- జీవన విధానాన్ని తెలిపే దమ్మ మార్గం- ప్రొఫెసర్ మహేష్ దియోకర్

జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

బౌద్ధం ఒక మతం కాదని అది జీవన విధానం తెలిపే ఒక దమ్మ మార్గమని పూణే యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ దియోకర్ అన్నారు.మంగళవారం నాగార్జునసాగర్ లోని బుద్ధ వనములో దమ్మ విజయ వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ వనములోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి వందనం సమర్పించిన అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించారు.అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ మహేష్ ధియేటర్ మాట్లాడుతూ బుద్ధుని దమ్మచక్ర ప్రవర్తన సారాంశాన్ని విస్తరిస్తూ అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజుని దమ్మ విజయముగా చెప్పబడుతుందన్నారు. ఇదే రోజున డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బుద్ధుని బోధనలకు అమితంగా ఆకర్షకులై బౌద్ధాన్ని స్వీకరించారు అన్నారు.బౌద్ధ ధమ్మము తో సమత మమత సహోదర తత్వం, విరాసిల్లిందన్నారు. ఆనాడు పాలి భాషలో అనేక ధమ్మ శాసనాలను ప్రపంచ నలుమూలల అశోక చక్రవర్తి విస్తరింపజేసి ప్రపంచం అంతట దమ్మ లిపి శాసనాల రూపంలో బుద్ధ దమ్మ సారాంశాన్ని వ్యాప్తి చేశారన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అసమానతలను రూపుమాపడానికి మనిషిలో ప్రేమ కరుణలను,సద్ధర్మాన్ని సాధించడానికి, సమానత్వాన్ని కలిగించడం కోసం బుద్ధ దమ్మ మే మార్గమని చాటాడన్నారు. ఇలాంటి మహాత్ములు స్వీకరించిన సర్ధర్మాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉందన్నారు. వీటన్నిటికీ బుద్ధవనం కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. బుద్ధ వనంలో బుద్ధుని బోధనలు తెలియజేసేలా ఒక విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కు సూచించారు.
అనంతరం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ బుద్దవనం తెలంగాణకు ల్యాండ్ మార్కుగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రశాంతతకు,దమ్మానికి, జ్ఞానానికి, ప్రేరణకు మారుపేరుగా బుద్ధవనం నిలుస్తుంది అన్నారు. బుద్ధిష్టు స్టడీస్ లో సర్టిఫికేషన్ విద్యను అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బుద్ధుని బోధనలు, బుద్ధుని దమ్మసారం బుద్ధవనం కేంద్రంగా ప్రచారం జరగాలని రాబోయే 10 నుండి 15 సంవత్సరాలలో బుద్దవనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. బుద్ధ వనములో విద్యా కేంద్రానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం హైదరాబాద్ రెడ్డి మహిళా కళాశాల కార్యదర్శి ముత్యం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో బుద్ధ వనంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే ప్రధానమని బౌద్ధ దమ్మ ఆవశ్యకతను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధ ధమ్మం తెలంగాణలో ఎలా ప్రవేశించింది వివరించారు. బుద్ధవనాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు కృషి జరుగుతుందని ఇప్పటికే డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత, బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్గొండ జిల్లా టూరిజం అధికారి శివాజీ, బుద్ధవనం ఆర్ట్స్ & ప్రమోషన్స్ మేనేజర్ శ్యామ్ సుందర్ రావు, బౌద్ధ అభిమానులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.