

దీపావళి కి కూడా పస్తులేనా.
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 15 :
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు సరైన సమయం లో ఇవ్వకపోవడం తో వాళ్ళ బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయి. సరైన సమయంలో వేతనాలు అందకపోవడంతో కొంతమంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు విధితమే. బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల ఎం ఆర్ సి మెసెంజర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రగిరి ఒక ప్రకటనలో పేర్కొంటూ కొన్ని సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని. పెరిగిననిత్యవసర ధరలతో కుటుంబ పోషణ భారాన్ని మోయలేక నిరాశకు, నిస్పృహ లోనై సగటున ప్రతి నెలకు ఇద్దరు చొప్పున గుండెపోటుతో మరణిస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేసారు. తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షలో పని చేస్తున్నటువంటి దాదాపు 20,000 మందికి ఇప్పటివరకు సెప్టెంబర్ నెల వేతనాలు రాకపోవడం విచారకరమని, తెలంగాణలో పెద్ద పండుగలైన బతుకమ్మ, విజయదశమికి సైతం వేతనాలందక పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, దీపావళికి ఐనా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనబోయిన రుద్రగిరి ప్రభుత్వాన్ని కోరారు. గత డిసెంబర్లో 28 రోజులపాటు సమ్మె చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని, అయినా ప్రజా పాలన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్మేమని అన్నారు. సమ్మె కాలపు హామీలను అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు ఎక్స్రేషియా చెల్లించడం తదితర డిమాండ్లను అమలు చేయాలని రుద్రగిరి ప్రభుత్వాన్ని కోరారు.