Listen to this article

జిల్లాకు వరప్రదాయిని అయిన రామతీర్థం జలాశయం పరిస్థితి దారుణంగా తయారైంది. 72వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, పామూరు, కందుకూరు పట్టణాలతోపాటు 45 గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తరమైన రిజర్వాయర్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అయ్యో ‘రామ’
రామతీర్థం అవుట్‌ఫాల్‌ రెగ్యులేటరీ గేట్లనుంచి లీకవుతున్న నీరు (ఫైల్‌)

గేట్లకు లీకులు.. వృథాగా పోతున్న నీరు

జలాశయం వద్ద కరెంట్‌ సౌకర్యం లేక అంధకారం

చిల్లచెట్లతో నిండిపోయిన ప్రధాన కట్ట

వెల్డింగ్‌ ఊడిపోయి వేలాడుతున్న గేటు

నిర్వహణను గాలికొదిలేసిన గత పాలకులు

కూటమి ప్రభుత్వమైనా పట్టించుకోవాలని రైతుల వినతి

జిల్లాకు వరప్రదాయిని అయిన రామతీర్థం జలాశయం పరిస్థితి దారుణంగా తయారైంది. 72వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, పామూరు, కందుకూరు పట్టణాలతోపాటు 45 గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తరమైన రిజర్వాయర్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఆలనాపాలనను గత వైసీపీ పాలకులు పూర్తిగా విస్మరించారు. జలాశయం వద్ద కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో అంధకారం నెలకొని ఉంది. ఔట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ గేట్ల నుంచి యథేచ్ఛగా జలాలు లీకేజీ రూపంలో వృఽథాగా వెళ్తున్నాయి. అలా ఏళ్లతరబడి సాగుతున్నా పట్టించుకునే నాఽథుడు కరువయ్యారు.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, (చీమకుర్తి), జనవరి 30 (జనం న్యూస్):

రామతీర్థం జలాశయం సమస్యలమయంగా మారింది. ఏళ్లుగా నిర్వహణను పట్టించుకోకపోవడంతో అంతా అయోమయంగా తయారైంది. ఐదేళ్లుగా గత వైసీపీ ప్రభుత్వం రిజర్వాయర్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో కనీస మరమ్మతులు కూడా కరువయ్యాయి. జలాశయాన్ని ప్రారంభించినప్పుడు ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. జలాశయానికి తూర్పు వైపునున్న ప్రధాన కట్ట మొత్తం చిల్లచెట్లతో నిండిపోయింది. దీంతో కట్ట ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. కరెంట్‌ లేకపోవడంతో పవర్‌ గేట్లు సైతం పనిచేయక సిబ్బంది చేతితో తిప్పుతూ నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. జలాశయం వద్ద కనీసం వాచ్‌మన్‌ కూడా లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతం అసాంఘిక కార్యకలా పాలకు నిలయంగా మారింది. రిజర్వాయర్‌ పరిసరాల్లో సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేశారు. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టు స్థితి ఇలా ఉంటే కొత్తగా జలజీవన్‌ మిషన్‌ కింద ప్రాజెక్టు పరిధిని మరింత విస్తృతపరచాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. రామతీర్థం వద్ద కొండపై నీటిశుద్థి కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లోని దాదాపు 300కుపైగా గ్రామాలకు నూతనంగా రక్షిత జలాలను అందించాలని ఆలోచన చేస్తోంది.

నిర్వహణ బాధ్యత ఎవరిది?

రామతీర్థం జలాశయాన్ని 2009 ఫిబ్రవరి 25న అప్పటి సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. నాటి నుంచి నిర్వహణ బాధ్యతలను ఎవరు చూడాలన్న విషయంపై స్పష్టత కరువైంది. జలాశయం దర్శి డివిజన్‌ పరిధిలో ఉండగా ఒంగోలు డివిజన్‌కు చెందిన ఏఈ ఒకరు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, లస్కర్‌ ఒక్కొక్కరు చొప్పున తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం చీమకుర్తి డివిజన్‌కు చెందిన ఇరిగేషన్‌ శాఖ ఉద్యోగులు కేవలం జలాశయంలో ఉన్న నీరు విడుదల, నిలుపుదల పనులు మాత్రం చేస్తున్నారు. మిగతా విషయాలను పట్టించుకునే బాధ్యత వారి మీద లేదు. రిజర్వాయర్‌కు సంబంధించిన మిగతా పనులు ఎవరు చూడాలన్నది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. రిజర్వాయర్‌ ఔట్‌ఫాల్‌ రెగ్యులేటరీ వద్ద నాలుగు వెంట్‌లు ఉన్నాయి. ఒక్కో వెంట్‌కు రెండు చొప్పున మొత్తం ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తుంటారు. వీటిల్లో నాలుగు పవర్‌ గేట్లు కాగా మరో నాలుగు మాన్యువల్‌వి. పవర్‌ గేట్లు పనిచేయకపోగా మాన్యువల్‌ గేట్లలో రెండు మొరాయించడంతో నీటి సరఫరాపై నియంత్రణ లేకుండాపోతోంది. కాగా జలాశయం ప్రారంభం నుంచే ఈ సమస్య కొద్దిమీర ఉండగా కాలక్రమేణా నిర్వహణను గాలికొదిలేయడంతో పూర్తిగా కిందికి దిగడం లేదు. దీంతో నీటి సరఫరా నిలిపివేసినా ప్రయోజనం లేకుండాపోతుంది. గేట్ల బిగింపు సమయంలో నెలకొన్న హడావుడితోనే ఈ సమస్యకు బీజం పడిందని నిపుణులు తెలిపారు. జలాశయం సామర్థ్యం 85.34 మీటర్లు కాగా నీటిమట్టం 80 మీటర్లకు చేరుకోగానే లీకేజీ మొదలై నీరు వృథా అవుతోంది. ప్రస్తుతం దాదాపు 40 క్యూసెక్కుల మేర జలాలు లీకేజీ రూపంలో వృథా అవుతున్నాయి.

వెంటనే మరమ్మతులు చేయాలి

ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని జలాశయాల గేట్ల మరమ్మతులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టిపెట్టి నిధులు సాధించడం ద్వారా శాశ్వత ప్రతిపదికన సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల నుంచి రాయల్టీలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే జిల్లా మినరల్‌ ఫండ్‌ కలెక్టర్‌ ఆధీనంలో ఉంటుంది. దాదాపు వంద కోట్ల మేర నిధులు అందుబాటులో ఉన్నాయి. అందులో కొంతమేర వెచ్చించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడితే జలాశయం లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టడంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎంపీ మాగుంట వినతితో కదిలిన సీఎం పేషీ

జలాశయం గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబునాయుడికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం పేషీ.. గేట్ల మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రూ.45లక్షలు ఖర్చవుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంచనాలు తయారుచేసి అనుమతి కోసం కలెక్టర్‌కు పంపారు. డీఎంఎఫ్‌ నిధులు ఉపయోగించి గేట్ల మరమ్మతులు నిర్వహించేందుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరితగతిన అనుమతులు మంజూరైతే గేట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మొరాయించిన గేట్లు.. రైతుల ఇక్కట్లు

రామతీర్థం రిజర్వాయర్‌ ఔట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ వద్ద ఉన్న గేట్లు మొరాయించాయి. మొత్తం నాలుగు ఉండగా ఇప్పటికే మూడు పనిచేయడం లేదు. ఒకదాని నుంచి మాత్రమే జలాలను కిందికి వదులుతున్నారు. ఇప్పుడు ఈ ఒక్క గేటు కూడా వెల్డింగ్‌ ఊడిపోయి కిందకి, పైకి ఆపరేట్‌ చేయలేని స్థితిలో వేలాడుతోంది. దీంతో ఆ కొద్ది ఖాళీ నుంచి మాత్రమే దిగువకు నీరు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం జలాశయం నిండుగా ఉంది. దీంతో నీటిని నిలుపుదల చేసే అవకాశం లేదు. సరఫరాను పెంచేందుకూ వీలు లేకుండా పోయింది. దీంతో దిగువనున్న కారుమంచి, త్రోవగుంట తదితర మేజర్ల కింద పంటలు సాగు చేసిన రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పొగాకు పంట వేసిన వారు సరిపడినన్ని జలాలు రాకపోతుండటంతో బుధవారం చీమకుర్తి-2 డీసీ అధ్యక్షుడు పాలడుగు వెంకటనారాయణ ఆధ్వర్యంలో నేరుగా జలాశయం వద్దకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. జలాశయం వద్ద బాగోగులు చూసేవారే కరువవడం, కనీసం కరెంట్‌ కూడా లేకపోవడాన్ని గమనించి ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి ఇక్కడి దుస్థితిని తీసుకువెళ్లారు. ఈఈ రామకృష్ణతో డీసీ అధ్యక్షుడు మాట్లాడారు. తక్షణమే గేట్లకు మరమ్మతులను చేయించి పంటలను కాపాడాలని కోరారు. విజయవాడ, కర్నూలు నుంచి ప్రత్యేక సిబ్బందిని పిలిపించి కనీసం ఒక్క గేటుకైనా మరమ్మతులు చేయించి నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో అధికారులున్నారు.

ప్రతిపాదనలు పంపాం.

రామకృష్ణ, ఈఈ, చీమకుర్తి

చీమకుర్తి డివిజన్‌ పరిధిలో మేజర్‌, మైనర్‌ కాలువల అభివృద్థికి రూ.5కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే రామతీర్థం జలాశయంపై చిల్లచెట్లు తొలగింపుతోపాటు పలు అభివృద్థి పనులు చేపడతాం. గత ఐదేళ్ల కాలంలో ఎటువంటి నిధులు మంజూరుకాకపోవడంతో ఏమీ చేయలేకపోయాం. ఇక జలాశయం వద్ద ఉద్యోగులను నియమించేందుకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యుత్‌ సౌకర్యం పునరుద్ధరించాలంటే ఏళ్ల తరబడి పెండింగ్‌ బిల్లులను చెల్లించాల్సి ఉంది. డీఎంఎఫ్‌ నిధులు మంజూరైతే గేట్ల మరమ్మతులు చేపడతాం.