

జనం న్యూస్:- ఆయనో బాధ్యత కలిగిన డాక్టర్. అయితే డ్యూటీలో ఉండి పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి బదులు మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. ఇంతలో గుండె నొప్పితో బాధపడుతూ 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకులు ఎమర్జెన్సీ వార్డుకు హడావిడిగా తీసుకొచ్చారు. గుండెపోటుతో ఆమె ప్రాణాలు కళ్లముందే పోతున్నా.. డాక్టర్ మాత్రం చలించకుండా ఫోన్ చూడటంలో బిజీ అయ్యాడు. ఇంతలో వృద్ధురాలు మరణించింది. నిలదీసిన మహిళ కుమారుడికి డాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమేకాకుండా.. దూకుడుతో అతడి చెంపపై డాక్టర్ కొట్టాడు. ఆగ్రహించిన మహిళ బంధువులు డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి (60) అనే మహిళకు మంగళవారం మధ్యాహ్నం తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. దీంతో ప్రవేశ్ కుమారిని ఆమె కుమారుడు గురుశరణ్ సింగ్ మహారాజా తేజ్ సింగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటీన తీసుకొచ్చాడు. నేరుగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకురాగా.. అక్కడే ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సెంగర్ మాత్రం ఫోన్‌లో రీల్స్ చూడటంలో బిజీగా ఉన్నాడు. కనీసం తల ఎత్తి వారిని చూడనైనా లేదు. మహిళ పరిస్థితి గురించి ఆమె కుమారుడు, బంధువులు డాక్టర్‌ను ఎన్ని సార్లు వేడుకున్నా స్పందించకపోగా.. ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. తీసుకెళ్లినప్పటికీ అతడు పట్టించుకోలేదు. ఆమెను చూడాలని నర్సులకు చెప్పాడు. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమయ్యాడు. దాదాపు 15 నిమిషాలపాటు మహిళ ఆ డాక్టర్ ఎదుటే విలవిలాడుతూ గుండెపోటుతో మరణించింది. దీంతో మహిళ కుమారుడు డాక్టర్‌ను నిలదీయ.. తాపీగా కుర్చీలో నుంచి లేచివచ్చి మృతురాలి బంధువులతో వాగ్వాదానికి దిగడమేకాకుండా ఆమె కుమారిడి చెంపపై ఆ డాక్టర్ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన మహిళ బంధువులు డాక్టర్‌పై దాడి చేశారు. ఈ విషయం తెలిసి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మదన్ లాల్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ మొత్తం సంఘటన ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రాణాలు కాపాడవల్సిన డాక్టర్ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు.