Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎం.ఏ.వై) పరిధిలో పట్టణంలో నిర్మిస్తున్న 207 ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడండి.

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపికను తుదిగడువులోపు చేపట్డండి.

జగనన్న కాలనీలు జనానికి కన్నీళ్లే మిగిల్చాయి ప్రత్తిపాటి

గృహనిర్మాణ శాఖపై మాజీమంత్రి ప్రత్తిపాటి సమీక్ష.

పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న బృహత్తర లక్ష్యం కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని, ఇళ్ల నిర్మాణానికి కేంద్రమిచ్చిన నిధుల్ని దారిమళ్లించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎం.ఏ.వై)లో భాగంగా నియోజకవర్గానికి మంజూరైన గృహాలపై శనివారం ఆయన గృహనిర్మాణ శాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.పీఎం.ఏ.వై పథకంలో భాగంగా అర్బన్ పరిధిలో మంజూరైన 207 ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికీ ఇళ్లులేని కుటుంబాలు ఎన్ని.. ఇంకా ఎన్నిఇళ్లు అవసరమవుతాయి.. గతంలో ఇళ్లు నిర్మించుకొని నివాసముండని కుటుంబాల వివరాలు సేకరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం పట్టణాల్లో ఇళ్లు కట్టుకునే వారికి రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.80లక్షలు చెల్లిస్తోందన్నారు. పీఎం.ఏ.వై బీ.ఎల్.సీ 2.0 లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గృహా లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టిందని, అర్హుల వివరాల్ని ఈ యాప్ లో నమోదు చేయడం తప్పని సరి అని ప్రత్తిపాటి తెలిపారు. అర్బన్, రూరల్ పరిధిలో ఇళ్లు లేనివారు సచివాలయాల్లోని గృహనిర్మాణ శాఖ ఇంజనీర్ అసిస్టెంట్లను కలిసి తమ వివరా లు అందించాలన్నారు. పూర్తి సమాచారంపై క్రేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అర్హులకు కేంద్రపథకంలో ఇళ్లు మంజూరవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం.ఏ.వై కింద ఇళ్లు నిర్మించాలను కునే వారు తమవివరాలను తుదిగడువు నవంబర్ 5 లోపే నమోదుచేసుకోవాలని, అధికారులు, సిబ్బందిని కలిసి పూర్తి వివరాలు అందించాలన్నారు. అలానే గృహనిర్మాణ సిబ్బంది.. సచివాలయ సిబ్బంది అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.జగనన్న కాలనీలతో జనాలకు కన్నీళ్లు వైసీపీ నేతలకు మేళ్లు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణ పురోగతిపై ప్రత్తిపాటి అధికారుల్ని ప్రశ్నించగా వారు పెదవి విరిచారు. నివాసానికి అనుకూలం కాని ప్రాంతాలను ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేశారని, దాంతో లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. జగనన్న కాలనీల ముసుగులో గత ప్రభుత్వం ప్రజలకు కన్నీళ్లు మిగిల్చిందని, భూముల కొనుగోలు..చదును.. మౌలిక వసతులు కల్పన..ఇళ్ల నిర్మాణం ముసుగులో దాదాపు రూ.2వేల కోట్లవరకు అవినీతి జరిగిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నివాసయోగ్యం కాని భూముల్ని అధికధరకు కొని వైసీపీనేతలు భారీస్థాయిలో మేళ్లు పొందారన్నారు. పేదల కనీసఅవసరాలతో వ్యాపారం చేసిన గతపాలకుల అవినీతి వ్యవహారాలను కూటమిప్రభుత్వం తప్పక వెలికితీస్తుందని, ప్రజల సొమ్ము కాజేసినవారిని చట్టపరంగా శిక్షిస్తుందని స్పష్టంచేశారు.సమీక్ష సమావేశంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మాద్దుమాల రవి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు డిఇ కె. సాంబయ్య, ఏఈలు కె. విజయ్ కుమార్, బి. నరేంద్ర, షేక్ గౌస్ భాషా తదితరులున్నారు.