Listen to this article

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 28 :

ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం ఇప్పుడు కొందరు అక్రమార్కుల చేతుల్లో కోట్ల రూపాయల దందాగా మారింది. ప్రజల ఆకలి తీర్చే ప్రభుత్వ బియ్యం ఇప్పుడు మాఫియాల కడుపు నింపే సాధనమైంది. రాత్రివేళల్లో రహస్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణా వ్యవహారం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, కొందరు రేషన్ ముఠాలు గ్రామాల్లో పగటిపూట తిరుగుతూ చౌకదుకాణాల ద్వారా వచ్చిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత రాత్రి వేళల్లో గూడ్స్ వెహికల్స్‌లో ఈ బియ్యాన్ని ఒక నిర్దిష్ట ప్రదేశానికి తరలించి అక్కడ లారీల్లో లోడ్ చేస్తారు. వీటికి తప్పుడు బిల్లులు సృష్టించి, లారీలను మండలాలు, జిల్లాలు దాటి బయటకు పంపుతున్నారు. ఈ రేషన్ బియ్యం చివరకు ప్రైవేట్ మిల్లులు, లేదా నల్ల మార్కెట్ వ్యాపారుల చేతికి చేరి, మళ్లీ ప్రజలకే అధిక ధరకు అమ్మబడుతోంది.ఈ మొత్తం దందాలో కొందరు చౌకదుకాణ డీలర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పేదలకు చేరవలసిన బియ్యం డీలర్లు, మధ్యవర్తులు, రవాణాదారుల చేతుల్లో లాభదాయక వ్యాపారంగా మారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అజాగ్రత్త, నిర్లక్ష్యం, మరియు కొందరి సహకారంతో ఈ అక్రమ రవాణా వ్యవస్థ నిశ్శబ్దంగా సాగుతోంది.కొన్ని గ్రామాల్లో ఈ రేషన్ బియ్యాన్ని క్వింటా, రెండు క్వింటాలుగా సేకరించి, మిల్లుల ద్వారా పాలిష్ చేయించి, మళ్లీ 25 కేజీల సీల్ బాగులుగా ప్యాక్ చేసి మార్కెట్లో మిల్లు బియ్యంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు తాము ప్రభుత్వ రేషన్ బియ్యం తింటున్నామని భావిస్తే, అదే బియ్యం నల్ల మార్కెట్‌ నుండి మళ్లీ కొనుగోలు చేస్తున్న వాస్తవం బాధాకరం.ఇప్పటికే ఈ దందాపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు మాత్రం “తదుపరి చర్యలు జరుగుతున్నాయి” అంటూ మాటలకే పరిమితమవుతున్నారు.ఈ పరిస్థితి కొనసాగితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని, తక్షణమే ప్రత్యేక దళాన్ని నియమించి అక్రమార్కులను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సివిల్ సప్లై శాఖ మేల్కొని, ఈ దందాలో ఉన్న ముఠాలను, డీలర్లను, మధ్యవర్తులను, మరియు వారికి సహకరిస్తున్న అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటేనే రేషన్ వ్యవస్థలో పారదర్శకత ఏర్పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజల కోసం రేషన్ పథకాలు మాఫియాల లాభాల బాటగా మారకూడదనే దృష్ట్యా, ఇప్పటికైనా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని సివిల్ సప్లై శాఖ మేల్కొని కఠిన చర్యలు తీసుకుంటుందా. లేదా వేచి చూడాలి.