జనం న్యూస్- అక్టోబర్, 29- నాగార్జున సాగర్ టౌన్ –
నాగార్జునసాగర్ లోని నాట్కో ఫార్మా కంపెనీలో గత రెండు నెలలుగా క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్న కార్మికుల పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం నాడు సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన ఫార్మా కంపెనీ యాజమాన్యం లక్ష్మీనారాయణ, వీరనారాయణ, రంజిత్, నారాయణలతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించినట్లుగా సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. బుధవారం నాగార్జునసాగర్ లోని నాట్కో ఫార్మా యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి లు మాట్లాడుతూ నాగార్జునసాగర్ కు చెందిన నాట్కో క్యాజువల్ కార్మికులు రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు మూడు సార్లు నాట్కో ఫార్మా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి చివరగా బుధవారం నాడు నాట్కో ఫార్మా యాజమాన్యంతో శాంతియుత వాతావరణంలో సామరస్యంగా క్యాజువల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఒప్పందం కుదిరింది అన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల తో పాటు క్యాజువల్ కార్మికులకు కూడా సెలవులు, బీమా, బోనస్, ఎడ్యుకేషనల్ అలవెన్స్, ఈ ఎస్ ఐ సౌకర్యాన్ని కోల్పోతున్న కార్మికులకు మెడికల్ క్లైమ్ వర్తింపు అయ్యే విధంగా బెనిఫిట్స్ ల తో పాటు సమ్మెలో పాల్గొన్న రెండు నెలల వేతనాలు కూడా చెల్లించి విధంగా యాజమాన్యం ఒప్పుకుందన్నారు. దీనితోపాటు ఫార్మా కంపెనీలలో అవసరం ఉన్న యూనిట్లలో భవిష్యత్తులో క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. వీరితోపాటు సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్, నాట్కో ఫార్మా క్యాజువల్ కార్మిక నాయకులు జటావత్ అనిల్, పి అంజి, కత్తి శీను, రంగా తదితరులు పాల్గొన్నారు.


