రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ..
జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 30.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నవీపేట మండలం అభంగపట్నం, తడ్ గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పు పట్టారు. ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకుని, వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయించడంలోనూ జాప్యం చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగేలా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.కాగా, తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా కలెక్టర్ స్వయంగా తేమ శాతం పరిశీలించారు. 17శాతానికి లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి, మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని, ధాన్యాన్ని ఎత్తైన ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తహసిల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు, బోనస్ ను కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.



