Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 31

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర్యం కేవలం ఒక రోజు కాదు, అది ఒక ప్రారంభం. 1947 ఆగస్టు 15న తెల్ల వారి జెండా దిగిపోయినప్పుడు, భారతదేశానికి స్వేచ్ఛ లభించినా, దేశ భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో, దాదాపు 565 సంస్థానాలు తమ ఇష్టానుసారం వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆనాటి పరిణామాలను ఊహించుకుంటే, నేడు మనం చూస్తున్న అఖండ, ఏకీకృత భారతం అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని సాకారం చేసింది ఒక్కరే సర్దార్ వల్లభాయ్ పటేల్! అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న మనం జరుపుకునే జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) కేవలం ఒక నాయకుడికి నివాళి కాదు, అది మన దేశ సమైక్యతకు పునరంకితమయ్యే పవిత్ర దినం.
విభజన చీకటిలో వెలుగురేఖ భారతదేశ చరిత్రలో అత్యంత సంక్షోభ భరితమైన ఘట్టం దేశ విభజన. రక్తపాతం, వలసల కల్లోలం మధ్య, సర్దార్ పటేల్ హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా అత్యంత కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగపరమైన చర్చలు, దౌత్యపరమైన ఒత్తిడి, అవసరమైన చోట కఠినమైన సైనిక చర్య… ఈ మూడు అస్త్రాలను సమర్థంగా ఉపయోగించి, దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడారు.
ఆయన పట్టుదల ఎంత గొప్పదంటే, ఎంతోమంది రాజులు స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నా, దేశ ప్రయోజనం కోసం లొంగిపోయేలా చేశారు. ఈ విలీన ప్రక్రియలో ఆయన ప్రదర్శించిన నిశ్చయమైన పట్టుదల కారణంగానే ఆయనకు ‘ఇండియన్ బిస్మార్క్. భారతదేశానికి ఉక్కు లాంటి మనిషి అనే బిరుదులు సార్థకమయ్యాయి. ఆయన కృషి ఫలితమే నేటి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే మహా సంకల్పం.
ఐక్యతా ప్రతిమ – నిలిచిన సంకల్పం సర్దార్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన సేవకు గుర్తింపుగా, ఆయన విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపంలో నిలబెట్టడం భారతదేశ గౌరవానికి చిహ్నం. కేవలం భౌతికంగానే కాక, పటేల్ తన పాలనలో అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనాపరమైన ఏకీకరణకు పునాది వేశారు. వ్యవస్థల ద్వారానే దేశంలోని ఏ మూల నుంచైనా సమర్థవంతమైన పాలన సాధ్యమవుతోంది.నేటి యువతరం – రేపటి భద్రతా దళం.ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు; వర్తమానంలో మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడానికి. నేడు, మన మధ్య భాష, ప్రాంతం, మతం, కులం పేరుతో చిన్న చిన్న అంతరాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడానికి, సర్దార్ పటేల్ చూపిన ఐక్యతా మార్గాన్ని మనం అనుసరించాలి.ఐక్యత లేకపోవడం మనల్ని కొత్త విపత్తులకు గురిచేస్తుంది, కానీ ఉమ్మడి ప్రయత్నం మన దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది.సర్దార్ వల్లభాయ్ పటేల్.ఈ స్ఫూర్తితో, దేశంలోని ప్రతి పౌరుడూ ఐక్యతా ప్రతిజ్ఞ చేయాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశపు అతిపెద్ద బలం అని గుర్తుంచుకోవాలి. మనమంతా ఒకే భారతమాత సంతానం అనే భావనతో, దేశ పురోగతికి మన వంతు కృషి చేయడమే సర్దార్ పటేల్‌కు మనం ఇచ్చే నిజమైన అంజలి.సమైక్యతే సముద్దరణ సేతువు,అనైక్యతే అనర్ధాల హేతువు.ఈ ఏకతా దినోత్సవం సందర్భంగా, దేశాన్ని ఏకతాటిపై నడిపించిన ఆ మహనీయుడికి ప్రణామాలు అర్పిస్తూ, మనమంతా కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం అని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోగు అశోక్ తెలిపారు…..