Listen to this article

నిర్లక్ష్యానికి నిదర్శనం – బోర్డులకే పరిమితం

జనం న్యూస్- నవంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను విద్యలో అంతర్భాగం చేయాలని పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచి దానిని విద్యా ప్రణాళికలో తప్పనిసరి చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ క్రీడా పాలసీ 2025 ను అమల్లోకి తెచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం  అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేడు అధికారుల పర్యవేక్షణ లేక పిచ్చి చెట్లతో నిండి వెలవెలబోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో వార్డుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగ నందికొండ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో బీసీ గురుకుల పాఠశాల మైదానంలో ఒక క్రీడా ప్రాంగణం మూడో వార్డులోని గౌతమ బాలవిహార్ లో ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి గత ప్రభుత్వం 2.50 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మంజూరు చేయగా, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చదును పేరుతో నాలుగైదు సార్లు రోలింగ్ చేసి క్రీడా ప్రాంగణాల బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన క్రీడా కిట్ లు ఇవ్వకుండానే చేతులు దులుపుకున్నారు. క్రీడా ప్రాంగణాలలో అవసరమైన క్రీడా సామాగ్రి, వసతులు కల్పించకుండానే అధికారులతో కుమ్మక్కై బిల్లులు మంజూరు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ సమయంలో గౌతమ బాలవిహార్ లోని క్రీడా ప్రాంగణంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ మెటీరియల్ ను డంపింగ్ చేసి మొత్తం పని పూర్తయిన తర్వాత క్లీన్ చేయకుండానే వెళ్లిపోవడంతో ఇప్పటికీ క్రీడా మైదానం కంకర రాళ్లతో నిండి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని స్థానిక యువత, క్రీడాకారులు కోరుతున్నారు.