నేటి నుంచి జాతర ప్రారంభం
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవ్పూర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయం
సుమారు 2 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం రాముని బండ ఆలయం, ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు సిద్ధమైంది. కార్తీక మాసం సం దర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు,బండపై సీతారాములు వెలవడంతో బండమీది జాతర అంటూ పిలుచుకుంటారు. జగదేవపూర్, కొండపాక, సిద్దిపేట, ములుగు, వర్గల్,చేర్యాల, యాద్రాది జిల్లా రాజపేట,
తుర్కపల్లి, మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం ముందు ఉన్న గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. అలాగే మహిళలు దీపారాధన చేసి కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందే భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి సూర్యోదయానికి ముందే మేల్కొని గుండంలో స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కొండపో చమ్మ ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలోనే సీతారాముల ఆలయం ఉండడంతో అక్కడికి వచ్చే భక్తులు ఆ రోజు తప్పకుండా సీతారాముల వారిని దర్శించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు నర్సింహాచార్యులు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు.


