ప్రమాద రహిత ప్రయాణానికై వాహనదారులు కృషి చేయాలి. సీఐ రామకృష్ణారెడ్డి
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సమావేశం
జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
రోడ్డు భద్రత చర్యల్ని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐ రామకృష్ణారెడ్డి అన్నారు,జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్క వాహనదారుడు మరియు ప్రయాణికుడు విధిగా పోలీస్ శాఖ సూచించిన ట్రాఫిక్ నియమ నిబంధనలను మరియు రోడ్డు భద్రత చర్యల్ని పాటించాలని తద్వారా తమతో పాటు తోటి ప్రయాణికులు, వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా తమ ఇంటికి చేరుతారని ఆయన అన్నారు, మండల పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో వాహనదారుల అతివేగం మరియు నిర్లక్ష్యం మూలాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగి ప్రమాద బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన తెలిపారు, కావున రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు వ్యక్తిగత బాధ్యతగా పోలీస్ శాఖ సూచనలను తప్పక పాటించాలని, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, కారు మరియు ఇతర వాహనాల్లో వెళ్లేవారు సీటు బెల్టు ధరించాలని, ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని, ఆటోలు మరియు ఇతర వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, సౌండ్ బాక్సులు భారీ శబ్దం చేసే లౌడ్ స్పీకర్లు వినియోగిస్తూ పాటలు వింటూవాటి మోజులో పడి ప్రయాణం చేయవద్దని, మద్యం తాగి వాహనాలు నడపడం మైనర్లకు వాహనాలు ఇవ్వడం, చేయరాదని, ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగి ఉండి, తమ యొక్క వాహనానికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితమైన ప్రయాణంతో గమ్యం చేరేలా వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆయన సూచించారు, ఈసందర్భంగా మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పార్ట్స్ (ప్రమాద స్థలాలు) అయిన మాధవరం, మొద్దుల చెరువు, తాడువాయి, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల, గ్రామాల ప్రజలతో రోడ్డు ప్రమాద నివారణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఎంపీఓ నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య,మాజీ వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, మరియు పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వివిధ గ్రామాల వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.




