జనం న్యూస్ సెప్టెంబరు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము
ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.25 కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని, వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు.విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులను కేటాయించడం పూర్తిగా అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమిక పాఠశాలల్లో 11–60 మంది విద్యార్థులు ఉన్నా కేవలం ఇద్దరు, 90 మంది విద్యార్థులు ఉన్నా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం వల్ల విద్యా ప్రమాణాలు గణనీయంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు.ఉపాధ్యాయులు బోధనతో పాటు ప్రతీ రోజు ఎఫ్ ఆర్ఏస్, ఏం డి ఏం, పి టి ఎం యు డి ఐ ఎస్ ఇ, ఎఫ్ ఎల్ ఎన్ –ఏ యాక్స్ ఎల్ వంటి అనేక ఆన్‌లైన్ పనులు నిర్వహించాల్సి వస్తుండటంతో విద్యార్థులకు సరైన సబ్జెక్ట్ బోధనకు సమయం దొరకడం లేదన్నారు.ఒకే సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రధానోపాధ్యాయ బాధ్యతలతో పాటు ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు బోధించడం అసాధ్యమని తెలిపారు.20, 30, 40 మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు, ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆ విధానం అమలు చేస్తేనే విద్యార్థులు పునాది దశలో పూర్ణ అవగాహన సాధించగలరని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం జీవో 25ను తక్షణమే రద్దు చేసి, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఆయన గౌరవపూర్వకంగా కోరారు.


