Listen to this article

ఏస్&పీసీ చూస్తుందా?

జనం న్యూస్ 07 నవంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నందా తండ గ్రామపంచాయతీ పరిధిలోని కర్రీ కోటేశ్వరరావు వెంచర్లో గల ఇంటి స్థలాలను ఆక్రమణకు గురైన భూముల్లో సింగరేణి సంస్థ సిమెంట్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. సింగరేణి సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగం కళ్లముందే ఈ అక్రమాలు సాగుతున్నాయన్నది స్థానికుల ఆవేదన. వేల రూపాయల విలువైన సింగరేణి సిమెంట్ దుర్వినియోగం అవుతున్నా, సంబంధిత అధికారులు కేవలం టోకెన్ దర్యాప్తుతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం, చుంచుపల్లి మండలంలోని నంద తండా గ్రామపంచాయతీ పరిధిలోని కర్రీ కోటేశ్వర్ రావు వెంచర్‌లో ఉన్న అనేక ప్లాట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ వెంచర్‌లోని ప్లాట్ నంబర్ 384లో ఒక ప్రైవేట్ సివిల్ కాంట్రాక్టర్ అక్రమంగా నిర్మాణ పనులు ప్రారంభించాడని సమాచారం. పక్కనే ఉన్న మరో ప్లాట్ కూడా మరో వ్యక్తి ఆధీనంలోకి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్లాట్లలో సింగరేణి సంస్థకు చెందిన సిమెంట్‌ను ఉపయోగించి నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి.సాక్షుల ప్రకారం, రాత్రిపూటనే నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ పిట్‌లలో సిమెంట్–కంకర మిశ్రమం పోసే పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఉపయోగించిన సిమెంట్ బస్తాలపై సింగరేణి కంపెనీ లేబుల్ ఉన్నట్లు చెప్పినవారున్నారు. ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, మిగిలిన కొన్ని సిమెంట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, దానిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.సింగరేణి సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగం కేవలం చూడచూడగా ఉన్నట్టే వ్యవహరిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు కొత్తగూడెంలో చర్చనీయాంశమైంది. సింగరేణి ఆస్తులను రక్షించాల్సిన విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ అక్రమాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.స్థానికుల డిమాండ్:“సింగరేణి సంస్థకు చెందిన సిమెంట్‌ను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణ స్థలాలను సర్వే చేసి, నిజాలు బహిర్గతం చేయాలి” అని ప్రజలు కోరుతున్నారు.