జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 10.
నిజామాబాదు.కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని, కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. సోయాబీన్ సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన సోయాబీన్ నిల్వల నాణ్యతను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సోయాబీన్ కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాలలో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం కల్దుర్కి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ ల లారీలు వెళ్ళాయి, ట్రక్ షీట్లు వెంటవెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరినందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన మీదట కొనుగోలు కేంద్రాలను మూసివేసే ముందు ట్రక్ షీట్ లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. 17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్క్ ఫెడ్ డీ.ఎం మహేష్, బోధన్ తహసిల్దార్ విఠల్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.



