Listen to this article

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

ఎస్. కోట లో వున్న పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ లను బహిరంగ వేలం ద్వారా నిజమైన వ్యాపారస్తులకు కేటాయించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ పూసపాటి ప్రతాప్ వర్మ జిల్లా కలెక్టర్ రామ్ సుందరరెడ్డి ని కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ లను దక్కించుకున్న వారు అధిక అద్దెలకు ఇతరులకు అద్దెకు ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని దీనిపై గతంలో ఫిర్యాదు చేయగా అప్పటి కలెక్టర్ దీనిపై ఎంక్వయిరీ చేయమని ఆదేశించారని కానీ నేటికీ అతీగతి లేదని వాపోయారు. అలాగే తారకరామా మార్కెట్ యార్డ్ ను 10 లక్షలు పెట్టి షెడ్లు వేసి నిరూపయోగంగా వదిలేసారని దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా గా మారిందని అన్నారు. గాంధీ పార్క్ పాడైపోయి చాలా రోజులైందని ప్రస్తుతం చదును చేసి ఉండడంతో అనుమానాలు కల్గిస్తుందని, దీనిని కబ్జా కాకుండా బాగు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సాయిబాబా గుడి పక్కన గల చెరువులో ఆసుపత్రి వ్యర్ధాలు వేయడంతో సమీపంలో వున్న హాస్టల్ విద్యార్థులు, ఆ దారిగుండా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యలన్నీ పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.