జనం న్యూస్ నవంబర్ 25( కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సమీపంలోని అమరవీర స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అది పూర్తి అయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని సంఘం నాయకులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన బిఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ కురిమెల్ల శంకర్ మాట్లాడుతూ “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం మాటల్లో కాదు, అమలులో కనిపించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ పార్లమెంటుకు పంపిన బిల్లును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. బీసీలకు మద్దతు ఉందని చెబుతుంటే, 9వ షెడ్యూల్లో చేర్చడం ఏమాత్రం కష్టం కాదు. దీన్ని పెండింగ్లో పెట్టి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ముమ్మరం చేస్తాం,” అని హెచ్చరించారు.అలాగే బీసీ హక్కుల కోసం అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల రాజకీయ భాగస్వామ్యం పెరగాలని, న్యాయమైన రిజర్వేషన్లు అమలు అవ్వడం వరకు పోరాటం ఆగదని కురిమెల్ల శంకర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ గౌడ్, ఉపాధ్యక్షులు మాదా శ్రీరాములు గౌడ్, జాతీయ సలహాదారుడు మిట్టపల్లి సాంబయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొదురుపాక మీనాక్షి, టౌన్ అధ్యక్షులు బిక్షపతి, టౌన్ అధ్యక్షురాలు ఎం. తిరుమల, బీజేపీ అధికార ప్రతినిధి జి. శ్రీధర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఏకయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


