30 లక్షలతో కంచె… కానీ చెత్త మాత్రం ఆగలేదు
సమస్యపై కనీస స్పందన లేని కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి*
జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజి ఈఎస్ఐ ఆసుపత్రి–బీహెచ్‌ఈఎల్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ రహదారి ఇరువైపులా బీహెచ్‌ఈఎల్ పరిశ్రమకు చెందిన భూమిలో ఎల్‌ఐజి ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానికులు ఈ రహదారి ఇరువైపులా నిర్లక్ష్యంగా చెత్త, వ్యర్థాలు పారవేస్తుండడంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది.సేకరించలేనంతగా పేరుకుపోతున్న ఈ వ్యర్థాలు బీహెచ్‌ఈఎల్ అధికారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. పలుమార్లు జీహెచ్ఎంసీ,పటాన్‌చేరు–రామచంద్రాపురం సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య శాశ్వత పరిష్కారం దొరకలేదు. సర్కిల్ సిబ్బంది తరచూ చెత్త తొలగించినా… కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ యథాతథంగా మారుతోంది.సమస్యకు మూల కారణమైన ఇంటింటికి చెత్త సేకరణ బలోపేతం, అవగాహన కార్యక్రమాలు, నిఘా ఏర్పాటు వంటి ప్రాథమిక చర్యలను పట్టించుకోకుండా… జీహెచ్ఎంసీ రూ.30 లక్షలతో అర కిలోమీటరుకు పైగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఫెన్సింగ్ పెట్టడం వల్ల పరిస్థితి ఏమాత్రం మారలేదు. సేంద్రియ–అజైవిక వ్యర్థాలు మళ్లీ రోడ్డు పొడవునా పేరుకుపోతూ, దుర్వాసనతో స్థానికుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.ఈ వ్యవహారంలో స్థానికులు కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహించారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సమస్యపై స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారి మాట్లాడుతూ “కంచె కాదు… అవగాహన, నిఘా, కఠిన చర్యలే సమస్యకు పరిష్కారం” అని స్పష్టం చేశారు.చెత్త వేయడం కొనసాగిస్తే జరిమానాలు విధించేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలి అని సూచించారు.చెత్త పారబోయొద్దని స్పష్టంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.నిత్యం చెత్త వేయబడుతున్న ఈ ప్రాంతంలోఇక్కడ చెత్త వేయరాదు”,చెత్త వేస్తే జరిమానా విధించబడుతుంది”,ఈ ప్రదేశం పబ్లిక్ ప్రాపర్టీ – దయచేసి స్వచ్ఛంగా ఉంచండి”అన్న సందేశాలతో పెద్ద పెద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, బీహెచ్‌ఈఎల్ అధికారులు కోరుతున్నారు.బోర్డులతో పాటు నిఘా బలోపేతం చేస్తేనే సమస్యకు అడ్డుకట్ట పడుతుందని వారు స్పష్టం చేశారు.


