జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నాకు జయప్రదం చేయండి
టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, ఎస్ సంపత్ కుమార్
జనం న్యూస్.28.నవంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడనాడాలని టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, ఎస్ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మహా ధర్నాకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో బతుకులు మెరుగు పడతాయని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి , పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత పదేళ్ల పాలనలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైపోయాయని,ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో ప్రయాణించడం దారుణమన్నారు. నూతన పాలసీని రూపొందించి అక్రెడిటేషన్లు జారీ చేయడం, ఆరోగ్య భద్రత కల్పించడం, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, అనేక వృత్తి కమిటీలను పునరుద్ధరించడం వంటి కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదన్నారు. అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని, సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 3 తేదీన హైదరాబాద్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , టియూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి సతీష్, ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ వేణుగోపాల్, వారణాసి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా సంయుక్త కార్యదర్శి రమేష్ , టీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు సురేష్ చారి, రాధాకృష్ణ చారి, నితీష్, రాజ్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాజు, దాసరి సురేష్, సాయికుమార్, సంతోష్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.


