Listen to this article

జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామ పంచాయతీల ఐదేళ్ల అభివృద్ధికి ఎన్నుకునే సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనని తెలుసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటు గల్లంతయిందని, ఇతర సమస్యలు చెప్పకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్ ను అడిగి పరిష్కరించుకోవాలన్నారు. ఈ శిక్షణలో బ్యాలెట్ బాక్స్ లను తెప్పించి మాదిరి పోలింగ్ కూడా చేస్తారన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అధికారులకు మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఓటు హక్కు ఉంటే ఫామ్ 14 ఇవ్వడం జరుగుతుందని, ఈ దరఖాస్తులను పూరించి సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేస్తే ఈనెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం తమ జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణకు హాజరైన అధికారుల హాజరు పట్టికను పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు చేశారు.ఈ పర్యటనలో గద్వాల ఎంపీడీవో శైలజ, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జారీ చేయువారు: డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.