బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది-దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
జనం న్యూస్- డిసెంబర్,8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ తమను ఎంతో ఆకట్టుకుందని దక్షిణాసియా దేశాల రాయబారులు అన్నారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటానికి వచ్చిన ప్రతినిధులు మలేషియా హై కమిషనర్ ముజఫర్ షాబిన్ ముస్తఫా, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ, భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్ సోప్ నాంగ్వెల్, థాయిలాండ్ రాయబారి చావనార్ట్ తంగ్ సుపంత్, ఆమె కార్యదర్శి రుచీ సింగ్ సోమవారం నాడు బుద్ధ వనాని సందర్శించారని బుద్ధ వనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎంట్రన్స్ ప్లాజా వద్ద వారికి తెలంగాణ సాంప్రదాయ ప్రకారం కోలాటం డప్పుల నృత్యాలమధ్య స్వాగతం పలికారు. బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య బౌద్ధ శాలువాలతో పుష్పగుచాలతో వారిని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాయబార్ల బృందం బుద్ధ చరిత వనంలోని బుద్ధ పాదాల వద్ద, మహా స్తూపం లోని ఆచార్య నాగార్జున విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో బుద్ధ వనములో నిర్మాణంలో ఉన్న బుద్దిస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ మ్యూజియాన్ని, తెలంగాణలో బౌద్ధ వారసత్వం పై వీడియోలను వారు వీక్షించారు.బుద్ధవనం ప్రత్యేకతల గురించి ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో బౌద్ధ విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార సంచాలకులు బుద్ధ పాల ప్రత్యేక బౌద్ధ ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం బుద్ధవనం సందర్శించిన రాయబారులను ఆశీర్వదించారు. బుద్ధవనం లోని వివిధ విభాగాలను సందర్శించిన రాయబారులు మాట్లాడుతూ ఇంత పెద్ద మహాస్థూపాన్ని, దాని చుట్టూ ఉన్న వేలాది శిల్పాలను,ఎన్ని రకాల స్థూపాల నమూనాలను శ్రీలంక బుద్ధుని శిల్పాన్ని, జాతక కధ శిల్పాలను ఒక్కచోట చూడడం గొప్ప విషయమని వారు అన్నారు.1700 సంవత్సరాల తర్వాత అమరావతి శిల్పకలకు మళ్లీ ప్రాణం పోశారని మహా స్తూపం అంతర్భాగంలోని అలంకరణ తమ ఎంతో ఆకట్టుకుందని ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. అనంతరం విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి తెలంగాణ టూరిజం హోటల్స్ జిఎం నాథన్, ఏ జి ఎం జంగయ్య రాయబార్ల బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. అటు తర్వాత సుందరంగా అలంకరించిన తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునసాగర్ జలాశయంలో విహరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన,, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్దవనం ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యామసుందర్రావు, లాంచీ యూనిట్ మేనేజర్ హరి, విజయ విహార్ మేనేజర్ కిరణ్, స్థానిక సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ ముత్తయ్య,, పెద్దవూర ఎస్సై ప్రసాద్ నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ వేణు, రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


