Listen to this article

జనం న్యూస్‌ 10 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మీడియా మిత్రులతో జిల్లా ఎస్పీ ‘ఇష్ట గోష్టి’ కార్యక్రమంను డిసెంబరు 9న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందించేందుకు, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలు గురించి చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ మహిళల భద్రత, రహదారి భద్రత, సైబరు భద్రతను జిల్లా ప్రజలకు కల్పించడంతోపాటు గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మహిళల భద్రతలో భాగంగా పోక్సో చట్టం పట్ల మైనరు బాలికలకు అవగాహన కల్పించేందుకు శక్తి బృందాలు జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోక్సో కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షింపబడే విధంగాను, ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా ఇప్పటి వరకు 25 కేసుల్లో నిందితులకు 20సం.లకు పైబడి కఠిన కారాగార శిక్షలు విధింపబడడం జరిగిందన్నారు. శక్తి ఎస్.ఓ.ఎస్. యాప్ ఉపయోగాలను మహిళలకు, విద్యార్ధినులకు వివరించి, వారి మొబైల్స్ లో యాప్ ను నిక్షిప్తం చేసుకొనే విధంగా, యాప్ ను వినియోగించి ఆపద సమయాల్లో మహిళలు పోలీసుల సహాయం ఏవిధంగా పొందవచ్చునో వివరిస్తున్నామన్నారు.రహదారి భద్రతలో భాగంగా ప్రజలు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పిస్తున్నామని, ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టి, ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వారికి ఈ-చలానాలను విధించడంతోపాటు గతంలో వారిపై గల ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జంక్షన్లలో ఆటోలను అస్తవ్యస్తంగా నిలిపే వారిపై చర్యలు తప్పవని, ప్రతీ ఒక్కరూ రహదారి భద్రత పాటించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం, ఆటో డ్రైవర్ల తో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు.సైబరు నేరగాళ్ళు అమాయక ప్రజలు, వారి అవగాహన రాహిత్యం వలన వారి బ్యాంకు అకౌంట్స్ నుండి డబ్బులను కొల్లగొట్టేస్తున్నారన్నారు. దీనిపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదన్న విషయాన్ని ప్రజలకు తెలుపుతున్నామన్నారు. అపరిచిత సంబర్లు నుండి వచ్చే ఎపికే ఫైల్స్ పై క్లిక్ చేయవద్దని, డిజిటల్ అరెస్టు, ఆధార్ నంబరును దుర్వినియోగం చేసారని, డ్రగ్స్, మాదక ద్రవ్యాల కేసుల్లో మీ పిల్లలు అరెస్టు చేయబడ్డారని వచ్చే కాల్స్ ను నమ్మవద్దని, అటువంటి కాల్స్ కు స్పందించవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపు నిచ్చారు.ప్రజలకు మెరుగైన పోలీసింగును అందించేందుకు మీడియా మిత్రుల అభిప్రాయాలను జిల్లా ఎస్పీ తెలుసుకొని, వాటిపై త్వరలో చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం గంజాయి ప్రభావం జిల్లాలో ఏవిధంగా ఉన్నది, రహదారి ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారులపై నుండి పశువుల తరలింపు, గంజాయి సేవించే వ్యక్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, అంబేద్కర్, సైబరు సెల్ సిఐ శోభన్ బాబు, డిసిఆర్బీ సిఐ కే.కుమారస్వామి, ఎస్ఐ రాజేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.