Listen to this article

జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ప్రతి మనిషి స్వతంత్రంగా, జీవించేందుకు మానవ హక్కులే బలమైన ఆధారమని బి &జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సౌత్ ఇండియా కార్యదర్శి శానం రవికుమార్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు…మానవ సమాజంలో హక్కులు లేని వ్యక్తి బానిసతో సమానమని, హక్కుల భావజాలం ప్రతి పౌరుడికి భద్రత, సమానత్వం, గౌరవం కల్పించే ముఖ్యమైన ఆయుధమని పేర్కొన్నారు. వివక్ష, అన్యాయం, అణచివేతల నుండి బయటపడే మార్గం మానవ హక్కుల పరిరక్షణతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు..ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ జాతి, మతం, వర్ణం, లింగం, సామాజిక స్థితి వంటి ఏ ఆధారంపై కూడా వివక్షకు గురికాకుండా సమాన అవకాశాలు పొందాలని కోరారు. సమాన హక్కులు ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పునాది వేస్తాయని రవికుమార్ అభిప్రాయపడ్డారు.మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకోవడం, అవినీతి వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాలను బి &జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు హక్కుల అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకుని, ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యతను నిర్వర్తించాలని రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.