

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ (28సం.లు) హత్య మిస్టరీని చేధించి, హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 14న వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10న నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్ (సాఫ్ట్వేర్ ఇంజనీరు) హత్య కేసును చేధించి, అదే గ్రామానికి చెందిన (ఎ-1) కోనారి అచ్చుతరావు (ఎ-2) కోనారి శివకృష్ణ లను అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. మృతుడు తండ్రి కోనారి సన్యాసిరావు @ సన్యాసి (48సం.లు) ఇచ్చిన ఫిర్యాదుపై తెర్లాం పోలీసులు కేసు నమోదు చేసారన్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావుల ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారన్నారు. విచారణలో నిందితులు (ఎ-1) కోనారి అచ్చుతరావు (32 సం.లు), (ఎ-2) కోనారి శివకృష్ణ (27 సం.లు) మరియు మరణించిన కోనారి ప్రసాద్ దగ్గరి బంధువులన్నారు. (ఎ-1) కోనారి అచ్చుతరావు భార్య వెంకటలక్ష్మితో మృతుడు కోనారి ప్రసాద్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలిసిందన్నారు. మృతుడు కోనారి ప్రసాద్ తరుచూ (ఎ-1) కోనారి అచ్చుతరావు ఇంటికి వస్తూ, అతని భార్యతో మాట్లాడడం, ఫోనులు చేసుకోవడం చేస్తుండేవారన్నారు. (ఎ-2) కోనారి శివకృష్ణ వదిన వెంకటలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో, ఆమె వాట్సాప్ చాట్స్ ను వెబ్ ద్వారా లాగిన్ అయి, వెంకటలక్ష్మి మరియు మృతుడు కోనారి ప్రసాద్ మధ్య కొన్ని వాట్సాప్ అశ్లీల సందేశాలను జరుగుతున్నట్లుగా గుర్తించి, వాటిని స్క్రీన్ షాట్స్ తీసి, తన అన్నయ్య (ఎ-1) కోనారి అచ్చుతరావుకు చూపి, వారిరువురి మధ్య వివాహేతరసంబంధం ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చి, కోనారి ప్రసాద్ ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకొని, సమయం కోసం వేచి చూసారన్నారు. ఈ క్రమంలో బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న కోనారి ప్రసాద్ ఫిబ్రవరి 7న గ్రామంలోకి వచ్చినట్లుగా (ఎ-1) కోనారి అచ్చుతరావు విశాఖపట్నంలో ఉంటున్న తన తమ్ముడు (ఎ-2) కోనారి శివకృష్ణకు ఫోనులో సమాచారం తెలపగా, శివకృష్ణ ఫిబ్రవరి 9న నెమలాం గ్రామానికి వచ్చాడన్నారు. మృతుడు కోనారి ప్రసాద్ (ఎ-1) కోనారి అచ్చుతరావు ఇంటికి వచ్చి ఫిబ్రవరి 10న తన మేనమామ ఇంటికి బూరిపేట గ్రామం వెళ్ళు తున్నట్లుగా నిందితులకు తెలపగా, తిరుగు ప్రయాణంలో తమకు సమాచారం ఇచ్చినట్లయితే తాము గ్రామ శివార్లలోని పొలాల వద్ద కలుద్దామని తెలిపారన్నారు. మృతుడు కోనారి ప్రసాద్ బూరిపేట గ్రామానికి వెళ్ళి ఫిబ్రవరి 10న తిరిగి నెమలాం గ్రామానికి బయలుదేరినట్లుగా ఎ-1 కోనారి అచ్చుతరావుకు సాయంత్రం 6-28 గంటల సమయంలో ఫోను చేసి తెలిపాడన్నారు. అనంతరం, తోటపల్లి కాలువ వద్దకు చేరుకొని మరోసారి ఫోను చేయగా, తాము రేవడి పొలాల్లో ఉన్నట్లుగా తెలపగా, కోనారి ప్రసాద్ అక్కడకు చేరుకొని, వారిని కలిసారన్నారు. నిందితులులు (ఎ-1) కోనారి అచ్చుతరావు, (ఎ-2) కోనారి శివకృష్ణ లు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కోనారి ప్రసాద్ తలపై కర్రతో కొట్టగా, ప్రసాద్ పరిగెత్తుకొంటూపారిపోతూ, కాలువలో పడిపోగా, మళ్లీ నిందితులు అక్కడకు చేరుకొని, కోనారి ప్రసాద్ తలపై కర్రలతో మోది, హత్య చేసారన్నారు. అనంతరం, ఆధారాలు లభించకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో మృతుడు కోనారి ప్రసాద్ మొబైల్ ఫోను, వ్యవసాయ బావిలో పడేసారన్నారు. అనంతరం, మృతుడు ప్రసాద్ శవాన్ని నిందితులు ఇరువురు రహదారి మీదకు తీసుకొని వచ్చి పడవేసి, అతని ప్రక్కగా అతను డ్రైవ్ చేస్తూ వచ్చిన మోటారు సైకిలును డ్యామేజ్ చేసి, రహదారిపై పడేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కేసులో బొబ్బిలి డిఎస్పీ జి. భవ్య రెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ బి.సాగర్ బాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది క్రియాశీలకంగా పని చేసి, హత్య కేసు కొద్ది రోజుల వ్యవధిలోనే మిస్టరీని చేధించారన్నారు. ఈ కేసులో కోనారి ప్రసాద్ ను హత్య చేసిన (ఎ-1) కోనారి అచ్చుతరావు (ఎ-2) కోనారి శివకృష్ణ లను అరెస్టు చేసి, ఇరువురి మొబైల్ ఫోనులను, బావిలో పడేసిన మృతుడి మొబైల్ ఫోను, మరియు హత్యకు వినియోగించిన కర్రలను సీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసి, కేసు మిస్టరీని చేధించుటలో క్రయాశీలకంగా పని చేసిన డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ బి.సాగర్ బాబు, కానిస్టేబుళ్ళు నాగరాజు, పృద్వీరాజ్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రధానం చేసారు.