

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టేన్స్ (ఎన్.డి.పి.ఎస్) చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులు ఖచ్చితంగా శిక్షింపబడే విధంగా దర్యాప్తు అధికారులు ఆయా కేసుల్లో దర్యాప్తును విజయవంతంగా పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా చట్టంలోని విధి, విధానాలను పాటించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 15న ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ఎన్.డి.పి.ఎస్. చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపర్చిన విధి, విధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే, ఆయా కేసుల్లోని నిందితులు ఖచ్చితంగా శిక్షింపబడే అవకాశం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణ, వినియోగం, విక్రయాలకు పాల్పడే నిందితులు కఠినంగా శిక్షింపబడితేనే ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. చట్టంలో పొందుపర్చిన విధి, విధానాలను దర్యాప్తు అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కేసుల్లో దర్యాప్తు అధికారులు ఏ చిన్న తప్పు చేసినా, నిందితులు శిక్షల నుండి తప్పించుకొనే అవకాశం ఉంటుందన్నారు. కావున, దర్యాప్తు అధికారులు ఈ తరహా కేసులను దర్యాప్తు చేసేటప్పుడు విధి, విధానాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కేసుల దర్యాప్తు చేయుటలో విధి, విధానాలను, మెళుకవల పట్ల అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం డిఐజి గోపీనాధ్ జెట్టి ఆదేశాలతో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని పోలీసు అధికారులకు నిర్వహించామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని, ఎన్.డి.పి.ఎస్. చట్టం పట్ల అవగాహన కల్పించుకొని, కేసుల్లో నిందితులు శిక్షింపబడే విధంగా చూడాలన్నారు. న్యాయస్థానాల్లో ఇప్పటికే వీగి పోయిన కేసుల్లో పోలీసు అధికారులు దర్యాప్తు చేయుటలో చేసిన తప్పిదాలను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, చట్టం పట్ల సంపూర్ణమైన అవగాహనను పెంచుకోవాలన్నారు. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీసు ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూపరిండెంట్ ఎ.రంగధాం మాట్లాడుతూ – ఎన్.డి.పి.ఎస్. చట్టం దర్యాప్తు అధికారులకు కొన్ని విధి, విధానాలను కల్పించిందని, వీటిని పాటిస్తూ ఎన్.డి.పి.ఎస్. కేసుల్లో దర్యాప్తు పూర్తి చేస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు. ఇందుకు దర్యాప్తు అధికారులు చట్టం పట్ల మంచి అవగాహన పొందాలన్నారు. కేసు నమోదు, ప్రాపర్టీ సీజర్, ఎఫ్.ఎస్.ఎల్. కు పంపడం, నిందితుల అరెస్టు, అభియోగ పత్రం దాఖలు, న్యాయ స్థానాల్లో సాక్ష్యాలను ప్రవేశపెట్టడం వంటి అంశాల్లో అధికారులు కొన్ని మెళుకవలను పాటించాలన్నారు. దర్యాప్తులో అధికారులు చేస్తున్న చిన్న తప్పిదాలు కారణంగానే నిందితులు శిక్షలు నుండి తప్పించుకుంటున్నరన్నారు. నిందితులు శిక్షింపబడేందుకు కేసును ఫ్రేమ్ చేయుటలో ఖచ్చితంగా విధి, విధానాలను అమలు చేస్తూ, డాక్యుమెంటేషను చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఎన్.డి.పి.ఎస్.చట్టం పట్ల అవగాహన కల్పించిన తరువాత పోలీసు అధికారులు వ్యక్తపర్చిన సందేహాలను ఎ.రంగధాం నివృత్తి చేసి, న్యాయస్థానాల్లో వ్యవహరించాల్సిన తీరు, కేసు దర్యాప్తులో పాటించాల్సిన నిబంధనలను, నియమాలను పోలీసు అధికారులకు వివరించారు. అనంతరం, వర్కుషాపులో పాల్గొని, చట్టంపట్ల అవగాహన కల్పించిన నెస్సాస్ట్ సూపరిండెంట్ ఎ.రంగధాంను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత సాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ వర్కుషాపులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎస్.రాఘవులు, జి.భవ్యరెడ్డి, ఎం.వీరకుమార్, పాడేరు డిఎస్పీ సహబాజ్ అహ్మద్, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.