

ఉచిత వైద్య శిబిరం
జనం న్యూస్, 17 ఫిబ్రవరి 2025, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కొల్లూర్ గ్రామంలో, జనని ఫౌండేషన్ మరియు గ్రామ పెద్దల సహకారంతో, సంగారెడ్డి జిల్లాలోని వెల్నెస్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ఉదయ శంకర్ పాటిల్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, జనని ఫౌండేషన్ చైర్మన్, చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే తపనతో తాను పుట్టిన గ్రామంపైన, గ్రామ ప్రజలపై ఉన్నమమకారాన్ని,ప్రేమను చాటుతూ, గ్రామంతో పాటు, ఝరాసంగం మండల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, తమ వంతు కృషిగా, సంగారెడ్డి జిల్లా లోని వెల్నెస్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించి, వారితో మాట్లాడి, ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ వారి ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరిస్థితులపై పరీక్షలు చేయించుకోవాలని, గ్రామ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, రైతు కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి వారి ఆరోగ్యం పై, అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాలు దోహద పడతాయని అన్నారు. ఈ వైద్య శిబిరంలో వెల్నెస్ హాస్పిటల్ వైద్యులు, రోగులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన వారికి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తాము నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని, వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి, సహకరించిన వారికి, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పెద్దలు నందు పటేల్, డప్పూర్ సంగమేశ్, గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.