Listen to this article

విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జనం న్యూస్ 19 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం లక్ష్మీదేవి పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలోని పదవ తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి,పట్టుదల క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏం చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టు కుని తమ పిల్లలు బాగా చదవాలని పాఠశాలలకు పంపు తుంటారని విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు . భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏ గ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివే విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. పరీక్షలకు కొన్ని రోజుల సమయం ఉన్నందున సమయాన్ని వృధా చేయకుండా చదవాలన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఏదైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 100% ఉత్తీర్ణత కు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం తొమ్మిదవ తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు అని ఆరా తీశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (FRS) లో హాజరును ఎలా నమోదు చేస్తున్నారు అని అధికారులు అడిగి, ప్రతిరోజు నమోదు కచ్చితంగా చేయాలని, ఆపార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వంట గదిలో రాళ్ల పొయ్యి మీద వంట వండటానికి గమనించిన కలెక్టర్ రాళ్ళకు బదులు ఐరన్ తో చేసిన పొయ్యిలను పయోగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మునగ మరియు కరివేపాకు ను వంటలలో ఉపయోగిస్తున్నారా అని అధికారులను అడిగి, విద్యార్థులకు ఆహారంలో వీటిని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని కాబట్టి వంటలో ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణం మరియు రెండు బిల్డింగుల మధ్య రేకుల షెడ్డు నిర్మాణం ఆవశ్యకతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంఈఓ ద్వారా సైన్స్ ల్యాబ్ మరియు రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండలరావు, ఎంపీడీవో చలపతి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాంబయ్య మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.