

జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో గీతం మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న నిర్వహించిన LuDoS (లెట్ అజ్ డూ సైన్స్) ఎగ్జిబిషను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – కేంద్ర ప్రభుత్వం వివిధ విద్యార్ధులు, పాఠశాల ఉపాధ్యాయుల్లో నిజ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను వివరించి, వారిలో సృజనాత్మకతను వెలికి తీసి, వారిని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రోత్సహించేందుకు LuDoS (Let Us Do Science) అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మన రోజువారి జీవితంలో సైన్స్ కు చాలా ప్రాముఖ్యత ఉందని, సమాజంలో నేడు మనం చూస్తున్న ప్రతీ విషయం, వినియోగిస్తున్న ప్రతీ వస్తువు కూడా ఆధునిక సైన్స్ మరియు టెక్నాలజీ ఫలితమేనన్నారు. నేడు మనం వినియోగిస్తున్న విద్యుత్, రవాణ
మరియు కమ్యూనికేషన్, వైద్యం, శస్త్ర చికిత్సలు, వ్యవసాయం అన్నియూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వలనే మనకు అందుబాటులోకి వచ్చాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్ధులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు. గీతం యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసరు డా. బి.స్పందన మాట్లాడుతూ – ఈ కార్యక్రమంలో భాగంగా గీతం-ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్, విద్యార్థులు 20 పాఠశాలలను సందర్శించి, 6000మంది హైస్కూలు విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ప్రణాళిక పొందించుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పోలీసు సంక్షేమ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సైన్స్ ప్రాజెక్టులను వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు, విద్యార్థులు స్వయంగా ప్రయోగాలను చేసే అవకాశాలను కల్పించామన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషనులో విద్యార్థులకు ఫ్యాను తిరగడం, రిఫ్రిజిరేటరు, వాటర్ హీటరు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోను, టివి, రేడియో టెలిస్కోప్, థండర్ స్టార్మ్, ఆప్టికల్ ఇల్యూజన్ వంటివి పని చేసే విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసరు డా. బి.స్పందన, స్కూలు ప్రిన్సిపాల్ సంధ్య, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఆర్ ఎన్.గోపాల నాయుడు, ఆర్ఎస్ఐ వర ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, గీతం, ఆంధ్ర యూనివర్సిటీలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులు పాల్గొన్నారు.