

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మరియు గ్రామానికి చెందిన వసంత రామకృష్ణ (26సం.లు)కు విజయ నగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.1000/- లు జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 21న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మరియు గ్రామానికి చెందిన వసంత రామకృష్ణ అనే వ్యక్తి 2019 సంవత్సరంలో ఒక స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఒక మైనరు బాలికను వెంటపడుతూ నమ్మించి మోసంచేసి
లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఎస్.కోట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ కె.నీలకంఠం కేసు నమోదు చేసారన్నారు. ఈ కేసులో అప్పటి ఎస్.కోట సిఐ బి.శ్రీనివాసరావు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ఎస్.కోట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి సకాలంలో సాక్షులను, ఆధారాలను న్యాయ స్థానంలో ప్రవేశపెట్టగా, నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడు వసంత రామకృష్ణకు ఒక సంవత్సరం కారాగారం మరియు రూ.1000/- ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా, ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ పి. రామ, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. పోక్సో కేసులో నిందితులకి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు ధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.