

జనం న్యూస్,కొమరాడ,ఫిబ్రవరి22, (రిపోర్టర్ ప్రభాకర్): పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కునేరు గ్రామంలో శనివారం నిర్వహించారు. పిహెచ్సీ వైద్యులు,జిల్లా ఆసుపత్రి,ఇండస్ ఆసుపత్రి వైద్య నిపుణులు శిభిరంలో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు మెగా శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎస్ఐ కె. నీలకంఠం తో కలిసి అక్కడ శిబిరంలో అందజేస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలకు తనిఖీలు చేపట్టారు, అందజేసిన చికిత్సా వివరాలు అక్కడ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. శిబిరంలో ఏర్పాటు చేసిన మందులు,వివిధ రకాల పరీక్షలు పరిశీలించారు.రెడ్ క్రాస్ సొసైటీ వారు అక్కడ రోగులు సేవా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారు తదితర శాఖల సమన్వయంతో గిరిజన ప్రాంత ప్రజలకు మెగా వైద్య శిభిరం ద్వారా వైద్య సేవా కార్యక్రమం చేపట్టడం మంచి ఆలోచన అని,ఎంతగానో దోహదపడుతుందని అని పేర్కొన్నారు. వైద్యాధికారులు,వైద్య సిబ్బంది వారి పరిధిలో ఉన్న మారుమూల గ్రామ ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.