

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే ఆర్థిక మంత్రి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెబుతూనే ఈ బడ్జెట్ మొత్తాన్ని అధికంగా చూపి మొత్తానికి అంకెలతో గారడీ ప్రదర్శించారు. ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లుగా, రెవెన్యూ లోటు రూ.34,712.84 కోట్లుగా చూపారు. ఈ లోటును ఏ రకంగా భర్తీ చేస్తారో చెప్పలేదు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ పై ఊసేలేదు, విద్యుత్ రంగం విషయంలో ప్రజల పైన భారాలు పడుతున్నాయి కాబట్టి విద్యుత్ భారాలు మోపకుండా పరిష్కారం చూపలేకపోయారన్నారు. విద్య రంగానికి పాఠశాల విద్యకు 31,805 కోట్లు , ఉన్నత విద్యకు 2,506 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్య వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధుల కేటాయించాలని చెబుతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 శాతం నిధులు కేటాయించి విద్యాభివృద్ధి గురించి గొప్పలు చెప్తే సరిపోదని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలు కలిగిన 100 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచుతామని చెబుతూ , గొప్పలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఉన్నత విద్యకు కేవలం 2,506 కోట్ల నిధులు ఏమాత్రం సరిపోతాయని అశోక్ ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, 5000 రూపాయిలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో పూజారులకు, ఇమాములకు, అర్చకులు, పాస్టర్లకి నెలకు 15000 ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడి చదివిన చదువుకు ఉద్యోగం దొరకక ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూసే నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపించక, నిరుద్యోగ భృతి యించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో 1 లక్షా అరవై వేల మంది వాలంటీర్లకి 9 నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించకుండా వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడేసిన పాపం కూటమి ప్రభుత్వానిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల నివారణకు చర్యలు చూపించలేదు అని అన్నారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పై మాటలు లేవన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలేదన్నారు. కార్మికవర్గాన్ని విస్మరించారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవడానికి, కొత్త పరిశ్రమలకి తేవడానికి మాటలు లేవు, జిల్లాలో పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులు పై మాటలు లేవు, మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికి మాటలు లేవు, జిల్లాలో ప్రభుత్వ వైద్య శాలలు మెరుగు కోసం మాటలు లేవు. రాష్ట్ర బడ్జెట్లో జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు లేకపోయినా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి గారు ప్రజాభివృద్ధి బడ్జెట్ అని ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు అని విమర్శించారు.