Listen to this article

జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు రంజాన్ మాసం ఉపవాస అధ్యక్షుల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభమవుతున్నందున జిల్లాలో ఉన్న ప్రతీ మసీద్‌, ఈద్గాలలో త్రాగునీరు, శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరా,వీధి లైట్లు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలోని ప్రార్థనా స్థలాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, త్రాగు నీటి సమస్య తలెత్తకుండా నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.రంజాన్ పర్వదినం రోజు ప్రార్థనా స్థలాల్లో మెడికల్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని డి.యం.హెచ్.ఓ కు ఆదేశించారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రంజాన్ మాసం ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం ప్రతినిధులకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు ,ఆర్డీఓ శ్రీనివాస రావు,గద్వాల్ తహసీల్దార్ మల్లికార్జున్,జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ బాబు, డి.యం.హెచ్.ఓ సిద్దప్ప,విద్యుత్ శాఖ ఈ.ఈ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.