

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కేంద్రీయ విద్యాలయాలోని సమస్యలను పరిష్కరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలియజేశారు. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఆయన మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బంది కొరత ఉన్నట్లు తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సాయి లోకేష్ ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ కమిషనర్ నిధి పాండేను చరవాణి ద్వారా సంప్రదించి సమస్యను మెయిల్ ద్వారా తెలియజేయగా.త్వరలోనే ఉపాధ్యాయులను నియమించి సమస్యను పరిష్కరిస్తానని నిధి పాండే హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన క్రికెట్ పోటీలలో పాఠశాలలోని 16 మంది బాలికలు జాతీయస్థాయికి ఎంపికై రాజస్థాన్ లో ఆడటం జరిగింది అని ఉపాధ్యాయ బృందం స్థాయిలోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వారికి శిక్షణ కొరకు సరైన ఆటస్థలం లేదని, కేంద్రీయ విద్యాలయ కు పక్కనే ఉన్న జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వారికి శిక్షణ కొరకు అనుమతి మంజూరు చేస్తే విద్యార్థినిలు జాతీయస్థాయిలో రాణించి పాఠశాలకు, రాజంపేట ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తారని కోరారు. వెంటనే స్పందించిన సాయి లోకేష్ ఆట స్థలం అనుమతి కొరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు కృష్ణ యాదవ్, సుబ్బరాయుడు, రమణ, ప్రసాద్ రెడ్డి, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
