ఆరోగ్యమే మహాభాగ్యం.. నాగేంద్రనగర్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
జనంన్యూస్ జూలై 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా వైద్య బృందం రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది. అలాగే ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించింది.గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రక్షిత, హెల్త్ అసిస్టెంట్ పండరి మోహన్, ఏఎన్‌ఎం సుమలత, ఆశా కార్యకర్తలు సరస్వతి, లత, మౌనిక, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు