ఎల్ నినో వాతావరణ ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

వ్యవసాయ అధికారి అమర ప్రసాద్
బిచ్కుంద జూలై 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండ రెంజల్ గ్రామంలో ఎల్ నినో వాతావరణ ప్రభావం పై రైతులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఎల్ ని నో వాతావరణం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు మరియు చెరువులు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గిపోతుందని రైతులకు వివరించారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉండడం మరియు వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులందరికీ వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలు మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు, పెసర్లు, మినుములు పొద్దు తిరుగుడు మరియు నువ్వుల వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. వరి నాట్లు వేసిన రైతులు ఆరుతడి పద్ధతి లో వరి సాగు చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తల, వ్యవసాయ శాఖ మరియు వాతావరణ శాఖ యొక్క సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పంటలను కాపాడుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వర్షాభావ పరిస్థితులను రైతులు అవకాశంగా తీసుకుని ఆయిల్ పామ్ పంట వేసే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని రైతులకు వివరించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ గొల్ల కవిత గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి భాను ప్రశాంత్, HUL కంపెనీ ప్రతినిధులు మరియు రైతులు హాజరయ్యారు.