ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు

ఏర్గట్ల, జూలై 24 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్నపీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే ఉద్దేశంతో హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌తో పాటు నాలుగు హౌస్ కెప్టెన్ల ఎన్నికలను అత్యంత రసవత్తరంగా నిర్వహించారు.ఈ ఎన్నికల్లో 10వ తరగతి విద్యార్థి రంజిత్ హెడ్ బాయ్‌గా, 10వ తరగతి విద్యార్థిని అశ్విని హెడ్ గర్ల్‌గా విజయం సాధించారు.ఎన్నికల నిర్వహణలో విద్యార్థులే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్లుగా బాధ్యతలు చేపట్టి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఓటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్ల వినియోగం, ఓట్ల లెక్కింపు వంటి ప్రక్రియలను ప్రత్యక్షంగా అనుభవించి ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకున్నారు.సాధారణ ఎన్నికలను తలపించేలా ఓటింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్క వేశారు. బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసి, వాటిపై స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసే విధానాన్ని అమలు చేశారు.ఈ కార్యక్రమం పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పర్యవేక్షణలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఆనంద్ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, సమిత, విజయ్, శ్రీనివాస్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి, ట్వింకిల్, గంగా మోహన్, రిషిక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు