కొత్త రాజోలిలోనే ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 28 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం కోత రాజోలి మండలం వరద ముంపు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల భద్రత, ప్రభుత్వ రికార్డుల రక్షణకు శాశ్వత పరిష్కారం చూపాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని కొత్త రాజోలిలోనే ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించబోయే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా పరిపాలనను డిమాండ్ చేశారు.ఇటీవల కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాజోలి మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేసి కొత్త రాజోలిలోని ప్రభుత్వ భూమిలోనే ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని కోరడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మొరుగు వీరేష్ మాట్లాడుతూ 2009 అక్టోబర్ 2న తుంగభద్ర కృష్ణా వరదల కారణంగా పాత రాజోలి గ్రామం పూర్తిగా ముంపునకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిందని గుర్తు చేశారు. ఆ విపత్తు అనంతరం అప్పటి ప్రభుత్వం వరద ముంపు లేని ఎత్తైన ప్రాంతంలో కొత్త రాజోలిని ఏర్పాటు చేసి సుమారు 3,700 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కేటాయించిందని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వం రూ.2 కోట్ల 25 లక్షలతో ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కొత్త రాజోలిలో అందుబాటులో ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్మించడంతో పాటు భవిష్యత్తులో మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కొత్త రాజోలిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎత్తైన ప్రాంతం కావడంతో వరద ముప్పు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా ఆస్తులు, ముఖ్యమైన రికార్డులు శాశ్వతంగా భద్రంగా ఉంటాయని తెలిపారు. గతంలో వరదల సమయంలో గ్రామపంచాయతీ పాఠశాలలతో పాటు అనేక కీలక రికార్డులు నష్టపోయిన అనుభవాన్ని మరువరాదన్నారు. అలాగే మండలంలోని 11 గ్రామాల ప్రజలకు ఒకే కేంద్రంలో ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు విశాలమైన పార్కింగ్, రవాణా సౌకర్యాలు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు కొత్త రాజోలి అత్యంత అనుకూల ప్రాంతమని పేర్కొన్నారు.ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజోలిలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మొరుగు వీరేష్ విజ్ఞప్తి చేశారు.కొత్త రాజోలి ప్రజలు అఖిలపక్ష కమిటీ చేపట్టిన ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ప్రజల న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.